కామారెడ్డి/చందూర్/నిజాంసాగర్/భిక్కనూరు, జూన్ 4 : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో రోడ్లు జలమయమవగా రైల్వేస్టేషన్ వెనుక భాగంలో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కిందపడిపోయింది. నిజాంసాగర్ మండల కేంద్రంలో నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా ప్రధాన రహదారిపై భారీ వృక్షం అడ్డంగా పడిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు చందూర్లోనూ గంటపాటు వర్షం కురిసింది.
భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో రైతులు ఆరబోసిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. లారీల్లో లోడింగ్ చేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని సౌత్ క్యాంపస్ సమీపంలో విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా ధాన్యం కుప్పలు కేంద్రాల్లో అలాగే ఉన్నాయి. గురువారం వర్షం కురవగా వడ్లు తడవకుండా ఉండడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు, సంచులను కప్పి, వాటిపై బండరాళ్లను ఉంచారు. మహ్మద్‌నగర్ మండలంలోని నర్వ గ్రామంలో లారీలు రాకపోవడతో తూకం చేసిన రెండు లారీల ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చింది.