బోధన్, జూలై 15: తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి ప్రస్తుతం వ్యవసాయం పండుగ అనే స్థాయికి వచ్చింది. రైతులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో రైతులు సాగు విధానాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్ వ్యవసాయంలో ముందుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిచ్చింది. ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతుల చెంతకు తీసుకువచ్చింది. కొత్త యం త్రాలతో సేద్యం ఎంత సులువు, లాభదాయకంగా చేయవచ్చో వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పించింది. విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చి.. వాటి కోసం రైతులు రోజుల తరబడి ఎండ, వానల్లో రోడ్లపై బారులు తీరే అవస్థను తప్పించింది. రైతుబంధుతో వ్యవసాయానికి పెట్టుబడి అవసరాలు తీరుతున్నాయి. 24 గంటల ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. దీంతో రైతుల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించిన యంత్ర పరికరాలకు తోడు డ్రోన్లు, ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాలను కూడా కొనుగోలు చేసేందుకు కొందరు రైతులు ముందుకు వస్తున్నారు.
యువ రైతుల డ్రోన్ వ్యవసాయం
ఈ ఫొటోలో ఉన్న యువకుడి పేరు నెక్కంటి సురేశ్.. స్వగ్రామం రుద్రూర్ మండలం లక్ష్మీపూర్ క్యాంప్. విద్యావంతుడైన ఈ యువకుడు వ్యవసాయంలో డ్రోన్‌ను ఉపయోగించాలన్న ఆలోచనకు వచ్చాడు. పురుగుమందులు చల్లేటప్పుడు కూలీలు తరచుగా అస్వస్థతకు గురవడం, సమయం ఎక్కువగా పట్టడం అతన్ని ఆలోచింపజేశాయి. రూ.ఏడు లక్షలతో డ్రోన్‌ను కొనుగోలు చేశాడు. డ్రోన్‌కు 10 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్.. ఎకరం పొలంలో పురుగుమందు స్ప్రే చేసేందుకు సరిపోతుంది. ఈ డ్రోన్‌లో ఐదు బ్యాటరీ సెట్లు, వాటిని చార్జింగ్ చేసేందుకు రెండు ఛార్జర్ సెట్లు ఉంటాయి. ఒక్కో బ్యాటరీ సెట్టులో పది నిమిషాలు మాత్రమే ఛార్జింగ్ ఉంటుంది. ప్రతి పది నిమిషాలకోసారి ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. డ్రోన్ హ్యాండిల్ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంచి దాని సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. డ్రోన్‌తో కూలీల ఖర్చు తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతున్నదని సురేశ్ చెబుతున్నారు.
గడ్డి కట్టలు కట్టే యంత్రం కొన్నా..
కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం అందిస్తున్నది. దీంతో సాగులో చాలా మార్పులు వచ్చాయి. ఇందులో భాగంగా గడ్డి కట్టలు కట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాను. ఎకరానికి రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణతో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ దిగుబడితోపాటు ఆదాయం పొందుతున్నాను.
-ఎడ్లపల్లి శ్రీనివాస్, రైతు, సత్యనారాయణపురం, వర్ని మండలం
నాడు నాగళ్లు.. నేడు ట్రాక్టర్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ట్రాక్టర్లకు ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రభుత్వం 2015 నుంచి 2017 వరకు విడుతల వారీగా రైతులకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లను పంపిణీ చేసింది. అనేక ఆధునిక వ్యవసాయ పరికరాలు పనిచేయాలంటే వాటిని ట్రాక్టర్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరికీ ఇచ్చిన ట్రాక్టర్లతో వ్యవసాయంలో యాంత్రీకరణ ఊపందుకున్నది. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి.
విత్తడం నుంచి కోత వరకు..
విత్తడం నుంచి పంట కోత వరకు ప్రతి పనికీ వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భూమిని దున్నడానికి కల్టివేటర్లు, దమ్ము చేసేందుకు కేజ్‌వీల్స్, దమ్ముతోపాటు బురదను చదును చేసేందుకు ఉపయోగపడే రోటవేటర్లను విరివిగా వినియోగిస్తున్నారు. నాటు యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక సోయాబీన్, మక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కంది తదితర పంటల విత్తనాలను గతంలో నాగలి, కూలీల సహాయంతో అలికేవారు. దీంతో ఒక ఎకరంలో విత్తనాలు వేయాలంటే ఒక రోజు పట్టేది. అదే విత్తనాలను అలికే యంత్రంతో ఒక రోజులో 15 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు వేయవ చ్చు. ఈ విత్తనాలతోపాటే యంత్రానికి ఉన్న మరో బాక్స్ ద్వారా ఎరువులనూ వేయవచ్చు. విత్తనాలు, ఎరువులు ఏ మోతాదులో వేయాలో.. ఈ యంత్రం లో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. రైతులకు శ్రమ తగ్గడంతోపాటు ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.