KTR | లింగంపేట : దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో సాయిలుకు జరిగిన అవమానానికి నిరసనగా శుక్రవారం ఆత్మ గౌరవ గర్జన నిర్వహించారు.
ఇందులో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు ఇంటికెళ్లి పరామర్శించారు. అక్కడే సాయితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ బాబా సాహెబ్ ను ఘనంగా గౌరవించింది కేవలం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. అంతేకాక దళిత డిక్లరేషన్ లో ప్రకటించింది ఏదీ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసమని తెలిపారు.
ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అడబిడ్డలు, పిల్లలను మోసం చేస్తున్నారని, అలాగే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అప్పులు ఉన్నప్పటికీ ఏ సంక్షేమ పథకం కూడా ఆగలేదని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. నడిపేటోడికి దమ్ముంటే ఆదాయం పుడతదని, పనులు కూడా పర్తవుతాయని చెప్పారు. గురుకులాల్లో విషం పెడుతున్నారని, వందల మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. 6.50 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదని విమర్శించారు. ప్రపంచ సుందరాంగులకు ప్లేట్ భోజనం కోసం రూ.లక్ష ఖర్చు చేశారని కానీ చిన్నారులకు మాత్రం భోజనం పెట్టేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు.