భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులందరిలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఒకరు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన చేసిన అతి గొప్ప పని.. భారతదేశాన్ని ఏకం చేయటం. ఎందుకంటే మిగతా దేశాలను కూడా కలుపుకొని అతిపెద్ద రాజ్యాన్ని రాముడు పాలించాడంటారు. అయితే ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలానికే భారతీయం 54 దేశాలుగా స్థిరపడింది. ఆయా దేశాల భౌగోళిక వివరాలు, రాజ్యాల పేర్లు, పాలించిన వంశాలు, ఆ వంశాల్లోని రాజులు-అన్ని వివరాలు వ్యాసమహర్షి మహాభారతంలో దొరుకుతాయి.
భారతదేశమని మనం ఇప్పుడు పిలుస్తున్న విశాల ప్రాంతం కూడా అనేక దేశాలుగా, రాజ్యాలుగా విడిగానే ఉండి కాలక్రమేణా వివిధ భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఏర్పడ్డాయి. అయితే విదేశీ దండయాత్రలు, ముఖ్యంగా బ్రిటిష్ వారి పరిపాలనతో భారతదేశ భూభాగం మీద ఉన్న రాష్ర్టాలన్నీ ఏకమై ఒక్క దేశంగా ఏర్పడ్డాయి. అయితే చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలు అలాగే వారసత్వ పాలనలో ఉండేవి. దేశాన్ని ఒక్కటిగా బలోపేతం చేయటానికి స్వాతంత్య్రం తర్వాత సర్దార్ పటేల్ చేసిన కృషి అమోఘం. ఈ చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాల పాలకులకు తగిన భరణం చెల్లించి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చారు సర్దార్ పటేల్. అయితే, ఈ కష్టతరమైన పని కంటే పదునైన, గొప్పదైన మాట ఒకటి అన్నారు ఆయన. ఇప్పటి ప్రజల ఇండ్లు కూల్చి, చనిపోయిన నాయకుల విగ్రహాలు పెడుతామంటున్న నేటి అజ్ఞానపు నాయకులకు పటేల్ మాట చెంపపెట్టు లాంటిది.
దేశాన్ని సర్దార్ పటేల్ ఏకం చేయటానికి, సాధించిన ఆ విజయానికి గుజరాతీలు పొంగిపోయి, కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్లి ఆయనను కలిశారు. తమ రాష్ట్రంలో ఆయనది పెద్ద విగ్రహం పెడుతామని ఉత్సాహంగా చెప్పారు. దానికి ఆయన చెప్పిన సమాధానం విని నీరుగారిపోయారు ఆ గుజరాతీ బృందంలోని వాళ్లు. ‘ఈనాడు మీరు నా విగ్రహం పెడుతారు. అయితే ఒక 50 ఏండ్ల తర్వాత రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు నా విగ్రహాన్ని చూపించి.. ఆయన ఎవరు నాన్నా? అని తన తండ్రిని అడుగుతాడు. చదువుకోని ఆ తండ్రి విచారంగా ‘నాకు తెలియదు బేటా’ అంటాడు. అందుకే నా గురించి చరిత్రలో ఉండాలి గానీ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డు మీద వచ్చే పోయే వారికి అడ్డంగా విగ్రహం లాగ ఉండటం నాకు ఇష్టంలేదు. విగ్రహం బదులు ఒక పాఠశాల స్థాపించి, నా గురించి ఒక పాఠ్యాంశం పెట్టండి. కనీసం చదువుకున్న వాళ్లకు నేనెవరో తెలుస్తుంది’ అని సర్దార్ పటేల్ చెప్పారు.
మరి మన అజ్ఞానపు నాయకులు, ముఖ్యంగా చదువులేని, తెలివిలేని వారు వేల కోట్లు వెచ్చించి పటేల్ విగ్రహం పెట్టారు. ఆ ధనంతో పటేల్ ఆశయానికి తగ్గట్టు ప్రభుత్వ పాఠశాలలు పెట్టి, అందరు పిల్లలకు 12వ క్లాసు వరకు తప్పనిసరి విద్యా విధానం ప్రవేశపెడితే పటేల్ ఎవరో అందరికీ తెలుస్తుంది కదా! నిజంగా గొప్పవారి విగ్రహాలు అలా ఏ ఆచ్ఛాదనా లేకుండా ఉండటం చూస్తే చాలా బాధ కలుగుతుంది.
గొప్ప ఇంగ్లీష్ రచయిత ఆస్కార్‌వైల్డ్ రాసిన ‘హ్యాపీ ప్రిన్స్’ కథ గూగుల్‌లో దొరుకుతుంది, ఎవరైనా చదవవచ్చు. పేదవారి కష్టాలు పట్టించుకోకుండా రత్నాలు, మాణిక్యాలతో తన విగ్రహం చేసి పెట్టడం ఆ ప్రిన్స్‌కు ఎంత బాధ కలిగిస్తుందో తెలుస్తుంది. ఇక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల నుంచి ఈ అనాగరిక పద్ధతులే యథేచ్ఛగా సాగుతున్నాయి. తెలంగాణను నిర్దంద్వంగా వ్యతిరేకించి, శతృపార్టీ తెలుగుదేశంతో కలిసి నాటకాలాడి, వందల మంది యువత ఆత్మహత్యలకు కారణమైన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఇక్కడ, మనకు అవసరమా? తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను వెలిబుచ్చే పాట పాడనన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నగరం నడిమధ్యన పెట్టడం దేనికి సంకేతం? 2014లో విడిపోయి రాష్ట్రమయ్యాక కూడా, ఆ ప్రాంతానికి తరలివెళ్లి స్థిరపడే ప్రేమలేని బాలసుబ్రహ్మణ్యానికి తమదికాని తెలంగాణ మీద ద్వేషం మాత్రం పుష్కలంగా ఉంది కదా! మరి వీళ్లంతా తెలంగాణ ప్రజా జీవితానికి ఏం ఒరగబెడుతారు?
జీవితం అనేది అదానీ, అంబానీలకు ఎంత విలువైనదో, సిమెంట్, కంకర మోసి వారి భవనాలు కట్టే కూలీలకు కూడా అంతే విలువైనది. న్యాయంగా మాట్లాడితే కూలీలదే ఎక్కువ విలువైనది. సబర్మతి ఆశ్రమంలో ఉండేవారు ఎవరి పని వారే కాక, ఆశ్రమం శుభ్రం చేసే పని కూడా చేయాలన్నది గాంధీ సిద్ధాంతం. గొప్పవారు తమ పిల్లలకు అది తెలియాలని కొన్ని రోజులు వారిని ఆశ్రమానికి పంపేవారు. బజాజ్ కుటుంబం నుంచి ఒక 20 ఏండ్ల అబ్బాయిని అతని తండ్రి ఆశ్రమానికి పంపాడు. అతి కష్టం మీద తన బట్టలు ఉతికి ఆరేసుకున్న ఆ కుర్రాడు టాయిలెట్లు మాత్రం శుభ్రపర్చనంటూ మొండికేశాడు. అప్పుడు గాంధీజీ అతన్ని పిలిచి ‘ఏదైనా మలినం చేయడం గొప్ప పనా, శుభ్రం చేయటం గొప్ప పనా? అని ప్రశ్నించారు. దానితో ఆ కుర్రాడు గాంధీజీ మాటల్లోని ఆ గొప్ప సత్యాన్ని గ్రహించి, మరుగుదొడ్లు శుభ్రం చేశాడు. అంతేకాదు, ఆ తర్వాత తన వ్యాపారంతో కొంత మంది పేదవారికి కూడా చాలా సాయం చేశాడు. గాంధీజీ తన ఆత్మకథలో చాలా గొప్పవి, మంచి విషయాలు చెప్పారు.
ఒక మనిషి సంస్కారం అతను తన కంటే పైస్థాయి వ్యక్తులతో ప్రవర్తించే తీరులో కాదు, తన కంటే చాలా చిన్న స్థాయి వ్యక్తులతో మెలిగే తీరులో తెలుస్తుంది అని. మరి పాలన చేతగాని నేతలు.. నగర సుందరీకరణ అని జీవం ఉన్న ప్రజల కంటే నిర్జీవ వస్తువులకు, పనికిరాని విషయాలకు ప్రాధాన్యం ఇచ్చే పనులు చేస్తుంటే ప్రజలు ఏం చేయాలి? రూ.5000 కోట్ల విగ్రహం విలువ ఎక్కువనా? 500 కుటుంబాల జీవనం విలువైనదా? ప్రభుత్వం వద్ద అన్ని డబ్బులుంటే చిన్నారులను బలి తీసుకుంటున్న గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించవచ్చు కదా! ప్రకృతిలో చీమ దగ్గర నుంచి అతిపెద్ద జంతువు వరకు అన్ని ప్రాణులు విలువైనవే! పోయిన గొప్పవారి గురించి పిల్లలకు చదువు ద్వారా చెప్పాలి కానీ, వేలకోట్లు వృథా చేసి, విగ్రహాలు నిలపటం తెలివితక్కువ పని.
గాంధీజీనే పూజిస్తామని చెప్పుకునేవాళ్లకు మహాత్ముడు అనుసరించిన తత్వం ‘దరిద్ర నారాయణ సేవ’ అని తెలియదా? సామాన్యుల ఇండ్లు కూల్చి, తన విగ్రహం పెట్టడాన్ని గాంధీజీ హర్షిస్తారా? చదువు, సంస్కారం లేని నాయకులు ఆనందపడుతారేమో కానీ, గాంధీజీ మాత్రం ఇటువంటి పనులు చేసే వాళ్లను క్షమించరు. గొప్పవాళ్ల శాపాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మహా భారతంలో పరీక్షిత్తు కథ చదవాలి.
పాలకులందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలని గాంధీజీ చెప్పారు. ‘పేదరికం అన్నింటి కంటే భయంకరమైన హింస. పాలకుడిని అనుకునేవాడి దృష్టి ధనవంతులకు సాయం చేయటం మీద కాదు, పేదవారికి ఉపాధి కల్పించి, లేని పక్షంలో వారి కనీస అవసరాలు తీరే వసతులు కల్పించాలి’ అని. మరి కనీస వసతి కల్పించకపోగా, సామాన్యులు వారే కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూల్చడమంటే గాంధీజీ ఏమంటారో ఊహించండి. పాలకులు హిరణ్య కశ్యపులు, హిరణ్యాక్షులు అయితే ప్రజలు కల్కి అవతారం ఎత్తాల్సిందే కదా!
– కనకదుర్గ దంటు