హైదరాబాద్, జూన్8 (నమస్తే తెలంగాణ) : సాగునీటి పారుదల శాఖలో ముఖ్యమంత్రి కోటరీ హవా నడుస్తున్నదా? అమాత్యుడికి తెలియకుండానే తెరవెనుక కొందరు అనుయాయులతో సీఎంవోనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నదా? నియామకాలు, బదిలీలు మొదలు, బిల్లుల చెల్లింపుల్లోనూ సీఎంవోనే కీలకభూమిక పోషిస్తున్నదా? తాజాగా సీఎం పాలమూరు పర్యటన కూడా ఈ కోటరీ కనుసన్నల్లోనే కొనసాగిందా? అంటే జలసౌధ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. ఇప్పుడిదే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంజినీర్లు సైతం మంత్రికంటే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టే ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై శాఖ మంత్రి ఉత్తమ్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అధికారవర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.
ఇరిగేషన్‌శాఖలో సీఎం అనుయాయులు, పైరవీతో వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ సలహాదారు మొదలుకొని దిగువస్థాయి వరకు పలు కీలక విభాగాల్లో సీఎంవో ఆదేశాల మేరకు వచ్చి చేరిన ఇంజినీర్లే ఉన్నారన్నచర్చ నడుస్తున్నది. వారిదే పెత్తనం కొనసాగుతున్నదని జలసౌధవర్గాలు నొక్కిచెప్తున్నాయి. ఇటీవలి బదిలీల సందర్భంగా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు అమాత్యుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా పారదర్శకత పాటించాలని, ఏ విభాగం ఇంజినీర్లను ఆ విభాగానికే బదిలీ చేయాలని తేల్చిచెప్పారు. కానీ ఆచరణలో అమాత్యుడి ఆదేశాలకు విరుద్ధంగానే పలు బదిలీలు కొనసాగాయి. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలనే క్షేత్రస్థాయిలో అమ లు చేశారని తెలుస్తున్నది. వాస్తవంగా నిబంధనల మేరకు ఆప్షన్ పెట్టుకున్న చోటుకు బదిలీ చేయాలి. అక్కడ అవకాశం లేకుంటే మరోసారి అవకాశం ఇవ్వాలి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు సైతం వారు కోరుకుంటేనే చేయాలి. కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో 40 నుంచి 50 మంది ఇంజినీర్లను ఆప్షన్ పెట్టుకున్న చోటుకు కాకుండా, ఇష్టారీతిన బదిలీ చేశారు. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అనేక మంది ఇం జినీర్లను బదిలీ చేయకుండా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్పైన రిటెన్షన్లు ఇచ్చారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదం తా కొనసాగిందని చర్చ జరుగుతున్నది. ఓ మంత్రి తనకు అత్యంత సన్నిహితుడైన ఇంజినీర్‌ను తీసుకువచ్చి బదిలీల నుంచి మినహాయించాలని శాఖ అమాత్యుడిని కోరారని, కానీ అందుకు ఆయన నిరాకరించారని, కానీ అదే మంత్రి తిరిగి సీఎంవో నుంచి చెప్పించుకోవడం, సదరు ఇంజినీరును యథావిధిగా అక్కడే కొనసాగించారని తెలిసింది. సీఎంవో పైరవీల వల్లే బదిలీలు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్టు చర్చ కొనసాగుతున్నది.
ఇరిగేషన్‌శాఖ బిల్లుల చెల్లింపుల్లోనూ సీఎంవోదే పెత్తనమని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎంవో ఆదేశాలు, సిఫార్సు లు లేకుండా ఒక్క బిల్లు కూడా విడుదల చేయ డం లేదని తెలుస్తున్నది. అమాత్యుడి ఆదేశాలకు కూడా దిక్కులేకుండా పోయింది. కాంగ్రె స్ వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్‌శాఖకు సంబంధించి రూ.13 వేల కోట్ల వరకు బిల్లు లు చెల్లించింది. అందులో సింహభాగం బడా కాంట్రాక్టర్లవేనని తెలుస్తున్నది. చెరువులు, ప్రాజెక్టుల ఓఅండ్ఎం పనులను నిర్వహించిన చిన్న కాంట్రాక్టర్లకు సుదీర్ఘకాలంగా బిల్లులు చెల్లించడం లేదు. పనులకు బిల్లులు రాక, మిగిలిపోయిన పనులు చేయలేక చిన్న కాంట్రాక్టర్లు సతమతమవుతున్నారు. కొందరైతే పనులను వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారే కాదు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్, హైర్ వెహికిల్స్ బిల్లులు కూడా విడుదల చేయడం లేదు. చిన్న కాంట్రాక్టర్లు, కార్మికులు అమాత్యుడిని సైతం అనేకమార్లు కలిసి గోడు వెల్లబోసుకోవడం, ఆయన బిల్లుల చెల్లింపునకు సిఫార్సు చేయడం వరకే సరిపోయింది. కానీ ఇప్పటికీ ఒక్కరి బిల్లు కూడా విడుదల కాలేదు. కేవలం సీఎంవో సిఫార్సు చేసిన బిల్లులకే ఇరిగేషన్‌శాఖలో మోక్షం లభిస్తున్నదని తెలుస్తున్నది.
ఇటీవల సీఎం రెండు రోజులపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనను ము ఖ్యమంత్రే సొంతంగా ఖరారు చేసుకున్నారని తెలుస్తున్నది. ఇరిగేషన్‌శాఖలో తన అనుయాయులైన ఇంజినీర్లను ముందుగానే పిలిపించుకొని ప్రాజెక్టు సందర్శనకు ప్రణాళిక సిద్ధం చే యాలని ఆదేశించారని సమాచారం. అధికారులతో చర్చించి, పర్యటన షెడ్యూల్‌ను ఖరా రు చేసుకున్న తర్వాత చివరి నిమిషంలో విషయాన్ని అమాత్యుడికి తెలిపినట్టు జలసౌధలో చర్చ జరుగుతున్నది. బనకచర్ల అంశంపై ప్ర భుత్వ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ మాత్ర మే మంతనాలు కొనసాగిస్తున్నారు. సమావేశం వివరాలను అమాత్యుడికి సైతం పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదని తెలిసింది.
ముఖ్యమంత్రి వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిసింది. బదిలీల విషయంలో సీఎం తెరవెనుక ఉండి నడిపిస్తున్న వ్యవహారాలు, పైరవీలతో తాను ప్రత్యక్షంగా బద్నాం అవుతున్నానని స న్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. పలు ప్రాజెక్టులకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పనులన్నీ ఎక్కడివక్కడే ప డకేశాయి. అవే కాదు డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్), పీఎం కృషి సించాయ్ యోజన తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ స్వయం గా పలుమార్లు ఆర్థికశాఖకు విన్నవించారు. ఆ వినతులను పట్టించుకోకపోవడంపై అమాత్యు డు అసంతృప్తితో రలిగిపోతున్నారు. కేవలం కొద్ది మంది బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లించడంపై మండిపడుతున్నారు. పాలమూరు పర్యటన విషయంలోనూ అమాత్యుడు నారా జ్ అయ్యారని సమాచారం. తనకు తెలియకుండా సీఎం ఆదేశాల మేరకు పర్యటనను ఖ రారు చేసిన ఇంజినీర్లను తీవ్రస్థాయిలో మందలించారని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇరిగేషన్‌శాఖపై బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే అదేస్థాయిలో మంత్రి ఉత్తమ్ రియాక్ట్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం పాలమూరు అంశంలో ముఖ్యమంత్రి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా మంత్రి మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉండిపోయారు. తనకేమీ సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తే ప్రధాన కారణమని ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు.