మృగశిర కార్తెని పురస్కరించుకొని.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సోమవారం బత్తిని కుటుంబం చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి ఆస్తమా రోగులు భారీగా రావడంతో ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది. అంతకుముందు నగర సీపీ సజ్జనార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారి సౌకర్యార్థం పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
-అబిడ్స్/ సుల్తాన్‌బజార్

అబిడ్స్/సుల్తాన్‌బజార్,జూన్ 8: మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి 8.40 నిమిషాలకు మాజీ ఎంపీ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేప మందు ప్రసాదాన్ని మాజీ ఎంపీ వీహెచ్‌కు,మెట్టు సాయికుమార్‌లకు బత్తిని అమర్నాథ్ గౌడ్ తన చేతుల మీదుగా వేశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తరతరాల నుంచి బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
దేశంలోని పలు రాష్ర్టాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉబ్బసరోగులు,అస్తమా రోగులు తరలి వచ్చి బత్తిని హరినాథ్ కటుంబ సభ్యులతో చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారన్నారు. 177 సంవత్సరాలుగా బత్తిని కుటుంబం చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేసి ఎందరికో మేలు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. చేప మందు ప్రసాద పంపిణీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రుల సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారన్నారు. ఈ చేప మందు ప్రసాదంతో అస్తమా తగ్గుతుందని పూర్తి విశ్వాసంతో అత్యధిక శాతం ఉన్నందునే ప్రతి ఏడాది సంఖ్య పెరుగుతూ వస్తుందన్నారు.
ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజులుగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 14 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ చేప మందు ప్రసాదం 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖ ల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యులు అమర్నాథ్ గౌడ్,గౌరీ శంకర్,చంద్రశేఖర్,సంతోష్,శివ శంకర్,దీపిక, విజయ,శైలజ, లావ ణ్య తదితరులు పాల్గొన్నారు.