మోర్తాడ్, జూలై 19: వరుణుడు కరుణించకపోవడం, మరోవైపు జల వనరులు సమృద్ధిగా లేకపోవడంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.వర్షాలు కురుస్తాయన్న ధీమాతో ఇప్పటికే తుకాలు వేసి, మక్కజొన్న, పసుపు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఎస్సారెస్పీ వరద కాలువలో రోజురోజుకూ నీరు తగ్గిపోతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద గండి పడిన తర్వాత ఇప్పటి వరకు వరదకాలువకు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయలేదు. అయితే గండి పడిన ప్రదేశంలో మరమ్మతులు పూర్తయిన నేపథ్యంలో వరదకాలువకు నీటిని వదలాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాలతో యాసంగి పంటల కోసం వరద కాలువకు రివర్స్పంపిగ్ ద్వారా మూడు సార్లు నీటిని విడుదల చేశారు. జనవరిలో రెండుసార్లు, మార్చిలో ఒకసారి రివర్స్‌పంపింగ్ ద్వారా వరద కాలువకు నీళ్లను వదలడంతో రైతులు గాండ్లపేట్ సమీపంలో మట్టికట్ట నిర్మించుకుని ఒడిసిపట్టుకున్నారు. అప్పుడు వరదకాలువలోకి వచ్చిన నీరంతా వర్షాలు కురవని కారణంగా మాయమవుతుండడంతో మరోసారి రివర్స్‌పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరదకాలువకు నీరు తెప్పిస్తేనే వానాకాలం పంటలు గట్టెక్కుతాయని అంటున్నారు.