బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సు చేస్తున్నది. అయితే ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లుగా నెలకు రూ.70,000 జీతాన్ని ఆమె పొందుతున్నది. (Karnataka MLA’s Niece) ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేష్ మేటి మేనకోడలైన డాక్టర్ అంకితా యరగల్, ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సు చేస్తున్నది. అలాగే ప్రభుత్వ అనుబంధ నమ్మ క్లినిక్‌లో ఆమె పనిచేస్తున్నట్లుగా నెలకు రూ.70,000 వేతనం కూడా పొందుతున్నది.
కాగా, ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వాంబే కాలనీలోని నమ్మ క్లినిక్‌లో వైద్య విధులకు డాక్టర్ అంకిత హాజరుకాలేదు. దీంతో వైద్య సేవల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె విధులకు హాజరుకానప్పటికీ ప్రతి నెలా జీతం పొందుతున్నట్లు బయటపడింది. దీంతో బాగల్కోట్ జిల్లా పంచాయతీ సీఈవో గజానన్ బాలే దీనిపై విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనధికారిక ద్వంద్వ నియామకం ఆరోపణలపై ఆమెకు సమన్లు జారీ చేశారు.
మరోవైపు తొలి నోటీస్‌కు డాక్టర్ అంకిత స్పందించలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు జిల్లా పంచాయత్ కార్యాలయంలో జరుగనున్న తదుపరి విచారణకు హాజరు కావాలంటూ సీఈవో మరోసారి సమన్లు పంపారు. తదుపరి విచారణకు హాజరు కాకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఆమెకు చెల్లించిన జీతం లేదా గౌరవ వేతనాన్ని నిబంధనల ప్రకారం తిరిగి రాబడతామని అధికారులు వెల్లడించారు.
అయితే డాక్టర్ అంకిత తండ్రి అయిన జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌వో) రాజ్‌కుమార్ ఈ అంశంపై స్పందించారు. ఆమెను విధుల నుంచి తొలించారు. తన కుమార్తె ఎండీ కోర్సులో చేరినప్పటి నుంచి ఎలాంటి వేతనం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, కుమార్తె అయిన డాక్టర్ అంకితకు మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడంలో ఆయన తండ్రి అయిన డీహెచ్‌వో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో దీనిపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.