Passport Index : ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల (Passports) శక్తిని అంచనా వేసే ‘పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 (Passport Index-2026)’ లో భారత్ స్థానం పడిపోయింది. ఈ తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్ (Global Rankings) లో భారత పాస్‌పోర్ట్ (Bharat Passport) 73వ స్థానంలో నిలిచింది. 2025లో 66వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది ఏకంగా ఏడు స్థానాలు దిగజారింది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్ అత్యంత బలహీనమైనదిగా జాబితాలో చిట్టచివరన నిలిచింది. ‘ఆర్టన్ క్యాపిటల్’ సంస్థ ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను రూపొందిస్తున్నది. వీసా లేకుండా (వీసా-ఫ్రీ), వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలున్న దేశాల సంఖ్య ఆధారంగా ‘మొబిలిటీ స్కోర్’ (ఎంఎస్) కేటాయిస్తారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాస్‌పోర్ట్ అంత శక్తిమంతమైనదని అర్థం. మొత్తం 199 దేశాల పాస్‌పోర్ట్‌లను ఈ ర్యాంకింగ్ కోసం విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ మొబిలిటీ స్కోర్ 69గా ఉంది. ఈ స్కోర్‌తో భారత్.. జింబాబ్వే, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, వియత్నాం వంటి దేశాలతో కలిసి 73వ స్థానాన్ని పంచుకుంటోంది.
భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు 25 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మరో 39 దేశాల్లో వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం ఉంది. అయితే 129 దేశాలకు వెళ్లాలంటే ముందస్తుగా వీసా తప్పనిసరి. గత ఏడాదితో పోలిస్తే వీసా ఆన్ అరైవల్ దేశాల సంఖ్య తగ్గడంతో మొబిలిటీ స్కోర్ 73 నుంచి 69 కి పడిపోయింది. ఇదే ర్యాంకు పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో యూఏఈ పాస్‌పోర్ట్ 181 మొబిలిటీ స్కోర్‌తో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా మొదటి స్థానంలో నిలిచింది.
యూఏఈ పౌరులు 138 దేశాలకు వీసా లేకుండా, 43 దేశాలకు వీసా-ఆన్-అరైవల్తో ప్రయాణించవచ్చు. కేవలం 17 దేశాలకు మాత్రమే వారికి వీసా అవసరం. ఇక ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్ అత్యంత బలహీనమైనదిగా 99వ ర్యాంకులో ఉంది. దాని మొబిలిటీ స్కోర్ కేవలం 35 మాత్రమే. ఆఫ్ఘన్ పౌరులు ఏకంగా 163 దేశాలకు కచ్చితంగా వీసా తీసుకోవాల్సిందే. అయితే ఇలాంటి గ్లోబల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏకపక్షంగా నిర్ణయించిన పారామీటర్ల ఆధారంగా ఈ నివేదికలను రూపొందిస్తున్నాయని కేంద్రం భావిస్తోంది.
దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గత జూలై 31న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. “పాస్‌పోర్ట్‌లకు ర్యాంకులు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలు లేవు. అందుకే ఏ ర్యాంకింగ్ వ్యవస్థను ప్రామాణికంగా తీసుకోలేం” అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.