– ఏడాది కూడా గడవకముందే సీసీ రోడ్డు దుస్థితి
– నాణ్యతపై కార్మికుల ఆందోళన
రుద్రంపూర్, సెప్టెంబర్ 16 : ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఏడాది కూడా గడవకముందే అధ్వానంగా మారింది. సీసీ రోడ్డుపై కంకర బయటకు వచ్చి, చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ప్రగతి మైదానం వద్ద విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారి కలుస్తుంది. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు మృత్యువాత పడగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు. దీంతో ప్రమాదాల నివారణకు అప్రోచ్ రోడ్డు నిర్మాణమే పరిష్కారమని పోలీసులు, సింగరేణి అధికారులు నిర్ణయించారు. అప్పటి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు ఆదేశాల మేరకు సుమారు రూ.12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు పనులు చేపట్టారు. గత ఏడాది అక్టోబర్లో పనులు పూర్తయ్యాయి.
అయితే ఏడాది కూడా పూర్తికాకముందే రోడ్డు దెబ్బతినడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ రోడ్డుపై కంకర బయటకు రావడం, వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో సంబంధిత సివిల్ అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సిమెంటు, కంకర, ఇసుకను నిబంధనల ప్రకారం వినియోగించారా? లేదా? అనే అంశంపై పరిశీలన జరపాలని కోరుతున్నారు.
ఈ పనులకు సంబంధించిన సిమెంటును 2025 నవంబర్ 6న కొత్తగూడెంలో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సింగరేణి ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకున్న ఘటనను కార్మికులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన సిమెంటు నాణ్యత, వినియోగంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.
ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అప్రోచ్ రోడ్డు ప్రస్తుతం వాహనదారులు, కార్మికులకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి రోడ్డు దుస్థితిని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.