Ye Niminashaniki Emi Jaruguno | యువ నూతన కథానాయకుడు అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైమ్ లూప్ థ్రిల్లర్ చిత్రం ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’. లక్కీ మీడియా మరియు కేడీ అండ్ కో పతాకాలపై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయితేజ దర్శకత్వం వహిస్తున్నారు. రతిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రం నుంచి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన ప్రచార గీతం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సినిమాకు సంబంధించి కృష్ణకాంత్ కలం నుండి జాలువారిన ‘ఏదో బాగుందే..’ అనే మధురమైన లిరికల్ వీడియో సాంగ్‌ను టాలీవుడ్ ప్రముఖ యువ హీరో శ్రీవిష్ణు తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. సాంగ్ రిలీజ్ అనంతరం హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఈ పాట ఎంతో ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. శశాంక్ తిరుపతి అందించిన సంగీతం శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుందని, సినిమా టైటిల్ నుంచి ప్రతీ అంశం సరికొత్తగా కనిపిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా తెలుగు తెరపై చాలా అరుదుగా వచ్చే ‘టైమ్ లూప్’ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషమని, ఈ సినిమా యూనిట్ అందరికీ మంచి విజయం సాధించి పేరు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.
సంగీత దర్శకుడు శశాంక్ తిరుపతి అందించిన బాణీలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రవికిరణ్ బోయడపు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, రతికలతో పాటు షైనింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితర నూతన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కో-ప్రొడ్యూసర్లుగా ఠాగూర్, నితీష్, నిఖిల్ వ్యవహరిస్తుండగా, రచన మరియు దర్శకత్వ బాధ్యతలను సాయితేజ విజయవంతంగా నిర్వర్తించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ విభిన్నమైన కథాచిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.