కంఠేశ్వర్, మే 25 : కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షం కురిస్తేచాలు వాగులను తలపిస్తున్నాయి. నాలాలు నిండిపోయి చెత్తపేరుకుపోతున్నది. దీంతో అది నాలానా లేక సాధారణ మార్గమా గుర్తించలేని పరిస్థితి దాపురించింది. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు నాలాలపై దృష్టి సారించడం లేదు.
నగరంలోని అర్సపల్లి, మాలపల్లి, వర్ని రోడ్, సాయినగర్, రైల్వేస్టేషన్, దుబ్బ, గంజ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లపైకి వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఓపెన్ నాలాల విషయమైతే చెప్పాల్సిన పని లేదు. వర్షం కురిస్తే చిన్న పిల్లలను బయటికి పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతేడాది వర్షాకాలంలో ఆనంద్‌నగర్ ప్రాంతంలో నాలాలు నిండుగా ప్రవహించడం, నాలాపైకప్పు లేకపోవడంతో రెండేండ్ల చిన్నారి వర్షపు నీటికి కొట్టుకుపోయింది.
వర్షాలు కురుస్తున్నందున అధికారులు స్పందించి ఓపెన్ నాలాలను గుర్తించి పైకప్పులు లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత హడావుడి చేసే అధికారులు.. మానవతా దృక్పథంతో ముందుగానే స్పందించి ప్రమాదాల నివారణతోపాటు ప్రాణనష్టం జరగకుండా చూడాలని విన్నవిస్తున్నారు.
పూడికతీత పనులు కొనసాగుతున్నాయి
నగరంలో మురికి కాలువలు, నాలాలు అన్ని పూడికలు తీసే పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న నాలాలను గుర్తించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
– దిలీప్‌కుమార్, నిజామాబాద్, నగరపాలక సంస్థ కమిషనర్