మోర్తాడ్, జూలై 8: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. 2002 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఆ జాబితాలో ఒక పేరు ఉండి, ఇప్పుడు మరో పేరు ఉంటే ఎలా? తల్లిదండ్రులు, నా అన్న వారు లేని వారి పరిస్థితి ఏమిటి? 2002 ఓటర్ లిస్టులో తల్లిదండ్రుల పేర్లు లేకపోతే వారి వారసులకు ఓటుహక్కు ఉంటుందా? అప్పటి జాబితాలో చాలా మంది వృద్ధుల పేర్లు లేవు.. వారి పరిస్థితి ఏమిటి?.. ఇలా అనేక సమస్యలు, సందేహాలతో ‘సర్’ గందరగోళంగా మారింది. సరైన వివరాలు లేవంటూ అలాంటి వారి ఎన్యూమరేషన్ ఫారాలను పెండింగ్‌లో పెడుతుండడం ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది.
సర్ ప్రక్రియలో అంతో ఇంతో సాఫీగా సాగిందంటే కేవలం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మాత్రమే. అది కూడా కొన్ని చోట్ల పత్రాలు వచ్చిన వారు దొరక్క బీఎల్వోలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలా చాలా మందికి పత్రాలు పంపిణీ కాని పరిస్థితులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ అటు ప్రజలను, ఇటు బీఎల్వోలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నది. ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ జరిగినా చాలా మందికి వాటిని భర్తీ చేయడం రాకపోవడం, భర్తీ చేసినా సాంకేతిక లోపాల కారణంగా అప్లోడ్ కాకపోవడం, ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చినా 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోవడం, 2002లో మరో పేరు ఉండడం, నా అన్న వారు లేని వారు, వారి పేర్లు 2002 జాబితాలో లేకపోవడం ఇలా అనేక సమస్యలతో సర్ కార్యకరమం అందరినీ అయోమయానికి గురిచేస్తున్నది.
గ్రామ స్థాయిలో పని చేసే వారిని బీఎల్వోలుగా నియమించారు. అంగన్వాడీ టీచర్లు, కారోబార్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇందులో కొంత మంది పత్రాల పంపిణీ కార్యక్రమం సజావుగానే చేసినా, వాటి భర్తీ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం, ఓటర్లకూ అదే పరిస్థితి ఉండడం పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బీఎల్వోలకు సహకరించాలని ఆశ వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అధికారులు చెప్పినా, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం తదితర కారణాలతో సర్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నది. పత్రాలు నింపడమే పెద్ద సమస్యగా మారడం, బీఎల్వోలే పత్రాలను నింపాల్సిన పరిస్థితులు రావడంతో అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
కమ్మర్పల్లి మండలం ఇనాయత్నగర్కు మెట్టు కవిత తల్లిదండ్రులు చాలా రోజుల క్రితం కాలం చేయడంతో వారి పేర్లు 2002 ఓటర్ జాబితాలో లేవు. అక్క దగ్గర ఆమె ఇనాయత్నగర్కు చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకోవడంతో ఆ గ్రామస్తురాలిగా మారింది. ప్రస్తుతం కవితకు సంబంధించిన వారి పేర్లు 2002 ఓటర్ జాబితాలో లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలనే సందేహంతో ఆమె సతమతమవుతున్నది. అధికారులు ఆమె పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే, ఓటు హక్కు కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని ఆమె ఆందోళన చెందుతున్నది.
లక్ష్మి ఎన్యూమరేషన్ పత్రా న్ని భర్తీ చేసి అధికారులకు తిరిగి ఇచ్చారు. వారు ఆ ఫారాన్ని అన్లైన్లో స్కాన్ చేస్తుంటే తీసుకోవడం లేదు. దీంతో సదరు మహిళ ఆందోళన వ్యక్తం చేయగా, సాంకేతిక సమస్య కారణమని అధికారులు చెబుతున్నారు.
మానాల గ్రామానికి చెందిన పీసరి భూమయ్యను రెడ్డి అని కూడా పిలుస్తారు. ఆయన అసలు పేరు భూమయ్య కాగా, 2002 జాబితాలో రెడ్డి అనే పేరు మీదనే ఓటు హక్కు వచ్చింది. ఆ తర్వాత ఓటర్ జాబితాలో ఆయన పేరు పీసరి భూమయ్యగా మారింది. సర్‌లో భాగంగా ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రంలో కూడా పీసరి భూమయ్యగా వచ్చింది. అయితే, 2002 ఓటర్ జాబితాలో రెడ్డి అని పేరు ఉండడంతో ప్రస్తుతం ఏ పేరు మీద ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపాలో తెలియన సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ఉన్న పేరు మీదనే నింపాలని అధికారులు చెబుతున్నా, రెండు వేర్వేరు పేర్ల కారణంగా ఓటు ఉంటుందా.. పోతుందా? అని ఆయన ఆందోళనకు గురవుతున్నాడు.
మోర్తాడ్‌కు చెందిన వృద్ధురాలి జైడి చిన్నుబాయి. ప్రస్తుత ఓటర్ జాబితాలో ఆమె పేరు ఉన్నా, 2002 జాబితాలో మాత్రం లేదు. దశాబ్దాలుగా మోర్తాడ్‌లోనే ఉంటున్నా, చిన్నుబాయితో పాటు తల్లిదండ్రుల పేర్లు కూడా 2002 జాబితాలో లేకపోవడంతో ఆమె ఎన్యూమరేషన్ పత్రాన్ని పెండింగ్‌లోనే ఉంచారు. సదరు వృద్ధురాలికి ఓటు హక్కు ఉంటుందా..? అన్నది సందేహాస్పదంగా మారింది
నస్రుల్లాబాద్‌కు చెందిన వడ్డె రమేశ్ గత 20 ఏండ్లుగా మోర్తాడ్‌లో ఉంటున్నాడు. చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. రమేశ్ సంబంధీకుల పేర్లు ఎవరివి కూడా 2002 జాబితాలో లేకపోవడంతో ఆయన ఎన్యూమరేషన్ ఫారాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఈ విధంగా చాలమందికి సంబంధించిన పత్రా లు వివిధ సమస్యల కారణంగా పెం డింగ్లోనే ఉంటున్నాయి.