బోధన్, జూన్ 7: ఓటర్ జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్య క్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది. తీవ్ర సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియ అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలు భర్తీ చేయ డం, తిరిగి ఇవ్వడంలోనూ, ఓటర్లుగా తమ అర్హతలను నిరూపించుకునే విషయంలోనూ ఓటర్లకు సవాలక్ష సందేహా లు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల నుంచి వస్తున్న అనుమానాలను, సందేహాలను తీర్చే దిశగా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో ‘సర్’ అప్లికేషన్ల ఫారాలను పంపిణీ చేయడం, వాటిని పూరించిన అనంతరం స్వీకరించటం, ముసాయిదా ఓట ర్ల జాబితాల ప్రచురణ తదితర పనులన్నీ జరగాల్సి ఉండడంతో.. ఈ మొ త్తం ప్రక్రియ అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది.
అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో పొలం పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతా ల్లో నాట్లు ఊపందుకున్నాయి. రైతులు బిజీబిజీగా ఉంటున్న ఈతరుణంలో కూలీలకు కూడా పుష్కలంగా పనులు దొరుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘సర్’అంటూ ఇబ్బంది పెట్టడంపై రైతులు, కూలీలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ‘సర్’ ఫారాల భర్తీకి ఏదో ఒకటి, రెండు గంటలు సరిపోవడం లేదు. బీఎల్వోల వద్ద, అక్కడక్కడ ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్‌ల వద్ద చాంతాడంత క్యూలు ఉంటున్నాయి. అటు పొలం పనులు చూసుకోవాలో.. ఇటు ‘సర్’కోసం పరుగులు తీయాల్లో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు
గత నెల 25 నుంచి ‘సర్’ గణన ఫారాలను పంపిణీ ప్రారంభమైంది. ఓటర్లు ఈ నెల 25లోగా భర్తీ చేసి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, నిర్దేశిత గడువు సమీపిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. ఓటర్ల అడ్రస్‌లు మారడం, కొంత మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పట్టణాల్లోని అద్దె ఇళ్లలో ఉండే వారు ఇతర ఇళ్లకు లేదా సొంతిల్లు కట్టుకుని వెళ్లడం జరిగింది. దీంతో ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారికి గణన ఫారాలు అందించడం బీఎల్వోలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికీ గణన ఫారాలు అందనివారి ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది.
ఓట్ల ఫారాలు ఇచ్చి తొందరగా నింపి ఇవ్వమని చెప్పారు. నాట్లు వేసే ఈ సమ యంలో ఈ లొల్లి ఏందో అర్థమైతలేదు. ఇప్పటికే వర్షాలు లేక మస్తు ఇబ్బంది పడు తున్నం. ఇగ ఈ ఫారాల్లో ఏం నింపాలో ఏమో తెలుస్తలేదు.. ఒకదిక్కు పొలాలకు వెళ్లే టైం.. మరోపక్క ఈ ఫారాలు నింపకుంటే ఓట్లు పోతాయని చెబుతున్నారు. ఏం చేయాల్నో సమజ్ పడకచ్చింది. 24, 25 ఏండ్లకు ముందు ఉన్న ఓటర్ల లిస్టుల పేరు ఉన్నదా.. లేదా? అని అడుగుతున్నరు. మాకు గా సంగతి తెల్వదాయే. ఏవో నంబర్లు అంటున్నరు. ఆ విషయం కూడా మాకు తెలనే తెల్వదు. ఇంట్లో అందరి ఫారాలు వెంట పెట్టుకుని తిరుగుతున్నా. ఈ ఫారాలు ఎందుకు నింపిపిస్తున్నరో తెలుస్తలేదు. ఓట్లు పోతే ఎవరు బాధ్యులు..
– జి. గంగాధర్, ఏకచక్రనగర్, బోధన్
ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేయడం కాస్త గందరగోళంగా మారింది. చదువుకున్న వారికే ఫారాలు నింపడం ఇబ్బందిగా ఉండగా, ఇక నిరక్షరాస్యుల పరిస్థితి మరీ దయానీయంగా తయారైంది. ఫారాల్లో భర్తీ కోసం అనేక కాలమ్స్ ఉండడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఒకేచోట నివాసం ఉన్న వారికి 2002 ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో చూసుకోవడం, సీరియల్ నంబర్‌ను తెలుసుకోవటం ఒకింత సులువుగా ఉన్నప్పటికీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారి విషయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఒక పట్టణం లేదా గ్రామం నుంచి మరో పట్టణం, మరో గ్రామం వెళ్లిన వారి విషయంలోనైతే 2002 ఓటరు జాబితాలో చూసుకోవడం సాధ్యం కావడం లేదని ఓటర్లు చెబుతున్నారు. అధికారులు, బీఎల్వోల వద్ద సంబంధిత గ్రామం, పట్టణానికి సంబంధించిన ఓటర్ల జాబితాలు మాత్రమే ఉన్నాయి. ఇక, 2002లో తర్వాత ఓటర్లుగా మారిన వారు తమ తండ్రి, తల్లి, సంరక్షుల ఓటు ఎక్కడ ఉందో చూపించాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులు, ఉపాధి కోసం పనిచేసే కూలీలకు ఇదంతా పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ ఓటు హక్కు ఉంటుందో.. ఊడుతుందోనని భయపడుతున్నారు.
‘సర్’ ఫారాల్లోని అనేక కాలమ్స్‌లో ఓటరు సీరియల్ నంబర్‌తో పాటు ‘ఎపిక్’ నంబర్లు అడగడంతో వాటి కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎపిక్ నంబర్లు తెలియని ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఓటరు జాబితాల్లో కూడా చాలా మందికి ఎపిక్ నంబర్లు లేవు. దీని కోసం ఓటర్లు ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఫారాలు నింపడం, ఎపిక్ నంబర్లు తెలసుకోవడం కోసం కొన్ని చోట్ల దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బీఎల్వోలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో సర్ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. చాలా చోట్ల బీఎల్వోలుగా ఎక్కువగా అంగన్వా డీ టీచర్లనే నియమించారు. వారికి మొక్కుబడిగా శిక్షణ ఇచ్చారు. దీంతో ఫారాల భర్తీ విషయంలో ఓటర్లకు సరైన సూచనలు ఇవ్వలేకపోతున్నారు.
అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘సర్’ విషయంలో సరైన ప్రచారం జరగలేదు. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో నెల రోజుల్లో పూర్తయ్యే ‘సర్’ విషయంలో అనేక సందేహాలతో ఓటర్లు సతమతమవుతున్నారు. ఫారాలు తాము సరిగ్గా భర్తీ చేశామా? ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఓటు హక్కు ఉంటుందా? భవిష్యత్తులో తమకు అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమోనన్న భయాందోళనలు ఓటర్లను వెంటాడుతున్నాయి. కొందరి పేర్లు ప్రస్తుత ఓటర్ల జాబితాల్లోనూ, 2002 ఓటర్ల జాబితాల్లోను తప్పుగా ఉండడంతో పాటు అడ్రస్‌లు కూడా తప్పుగా ముద్రితమయ్యాయి. మరోవైపు, ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు కూడా తక్కువేం లేరు. వీరి ఓట్ల విషయం ఏమటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఈ విషయంలో సరైన క్లారిటీతో ప్రచారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
సర్ కార్యక్రమం అని చెప్పి మాకు ఫారాలు ఇచ్చిండ్రు. వీటిని నింపి త్వరగా అందజేయాలని చెప్పిండ్రు. మా ఇంట్లో కొద్దో గొప్పో చదువుకున్న వారు ఉన్నా.. 2002 ఓటర్ జాబితాలోని వివరాలు సేకరించాలని, వాటి ఆధారంగానే ఫారాలు నింపాలని అంటుండ్రు. 2002 ఓటర్ జాబితా ఎక్కడ ఉన్నదో, దాంట్లోని ఏ నంబర్ ఎక్కడ రాయాలో అర్థమైతలేదు. రెండు రోజుల నుంచి ఫారాలు పట్టుకుని తిరుగుతున్నాం. బాగా చదువుకున్న వారు కూడా ఈ ఫారాలు నింపడానికి ఇబ్బంది పడుతున్నరు. ఇట్ల అయితే చదువుకోని వాళ్ల పరిస్థితి ఏమిటి?
– పడాల శంకర్, బోధన్