నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి/ఎల్లారెడ్డి : జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మొదట్నుంచి బీఆర్ఎస్కు కామారెడ్డి కొండంత అండగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు ఓటేసి గెలిపించాలని కోరా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రో జులు పూర్తయినప్పటికీ ఆరు గ్యారెంటీల అమలుపై ఎలాంటి స్పషతా లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఫేక్ వార్తలు, లీకులతోనే కాంగ్రెస్ సర్కారు కాలక్షేపం చేస్తున్నదని దుయ్యబట్టారు. డిసెంబర్ 9 నాడే రూ.2లక్షల రుణమాఫీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాటెత్తడం లేదని ప్రశ్నించారు. రైతులంతా ఈ మోసాలను గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు లింగంపేట్ మండల కేంద్రంలో జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ముఖ్య నేతలతో పాటుగా నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను, కామారెడ్డికి చెందిన పోలీస్ కిష్టయ్య ప్రాణ త్యాగాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు.
మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చావునోట్లో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావ డం లేదన్నారు. తెలంగాణలో ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఈ సమయంలో వీడుతున్న వారిని భవిష్యత్తులో తిరిగి తీసుకునేదే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలే నాయకులుగా ఎదగాలన్నారు. అవకాశాలన్నీ కార్యకర్తలకే దక్కేలా అండగా నిలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ మోసాలపై కార్యకర్తలంతా గ్రామా ల్లో ప్రజలతో చర్చ నిర్వహించాలని సూచించారు.
వంద రోజులు దాటిపోయినా ఇచ్చిన హామీల గురించి పట్టిచుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కుర్చీ ఎక్కేందుకు తొందరపడిన రేవంత్ రెడ్డి… రుణమాఫీ మాత్రం మర్చిపోయిండని ఎద్దేవా చేశారు. పంటలకు బోనస్ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకూ కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల రూపాయల బాకీ పడిందన్నారు. ఆడబిడ్డలకు రూ.10వేలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలన్నా రు. డిసెంబర్ నుంచే పింఛన్ పెంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా వృద్ధులకు రూ.4వేలు పింఛన్ అందడం లేదన్నారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరుతో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ వంద రోజు పాలనలో 280 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వార్తలు, లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. లీకులు, ఫేక్ వార్తలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి తన అధికారంతో పెద్ద నాయకులను కొనుగోలు చేయవచ్చని, కానీ కార్యకర్తలు, ఉద్యమకారులు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేడని అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీలు లోయపల్లి నర్సింగరావు, పిప్పిరి ఆంజనేయులు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, లింగంపేట్‌లో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణ, ఎనిమిది మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పదేండ్లుగా ఎంపీగా ఉండి పది పైసల పని చెయ్యని వ్యక్తిగా బీబీ పాటిల్ నిలిచారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బీబీపాటిల్‌కు బీజేపీ నుంచి కూడా మద్దతు లేదన్నారు. ఎంపీగా ఏ ఒక్కనాడు ఒక్క గ్రామంలో కూడా తిరగని వ్యక్తి ఇప్పు డు రాత్రికి రాత్రే పార్టీ మారి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడని చెప్పారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. చెత్తంతా బయటకు పోవడం తమ పార్టీకి మంచిదన్నారు. దేవుడిలాంటి కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయక పోతిమి అని ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని తెలిపారు. సాధారణంగా ప్రభుత్వం వచ్చినంక మూడు, నాలుగేండ్లలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కానిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు మాసాల్లోనే వ్యతరేకత వచ్చిందన్నారు. పదవుల కోసం వచ్చిన స్వార్థపరులే ఈ రోజు పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు దొందు దొందేనన్నారు. కారు గుర్తుకు ఓటేసి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇందుకోసం గులాబీ సైన్యమంతా పాటుపడాలని పోచారం పిలుపునిచ్చారు.
ఇటీవల కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే కాంగ్రెస్, బీజేపీ లు అసత్య ప్రచారం, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
జహీరాబాద్ ఎంపీగా ఒకరు ఐదేండ్లు, మరొకరు పదేండ్లు పనిచేసినా అభివృద్ధి శూన్యం. ఎలాం టి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించండి. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందజేస్తా..