నందిపేట్, నవంబర్ 10: నందిపేట్ అభివృద్ధి విషయంలో తాము తగ్గేదేలేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వం వివేకానంద చౌరస్తా నుంచి మజీద్ వరకు విస్తరణ చేపట్టగా.. ఇప్పటివరకు నంది విగ్రహం వరకే రోడ్డును నిర్మించారని తెలిపారు.
అక్కడి నుంచి మజీద్ వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినా.. స్థానిక దుకాణాసముదాయాల వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే ఒప్పుకున్నా కాంట్రాక్టర్ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడని మండిపడ్డారు. 20 వేల మంది ఉన్న నందిపేట్లో 20 మంది ఆపితే ఎలా అని ప్రశ్నించారు. మొత్తం రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేసే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఎర్రం మురళి, మచ్చర్ల చిన్నసాయిలు, నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.