నిజాంసాగర్, నవంబర్ 8: ‘నేను మీ నియోజకవర్గ బిడ్డను.. జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామానికి చెందిన వాడిని.. ప్రభుత్వ ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా.. ఆశీర్వదించి గెలిపించండి..’ అని జుక్కల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హన్మంత్‌షిండే ఓటర్లను అభ్యర్థించారు. జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి మహ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి, నర్వ, గున్కుల్, బుర్గుల్, తున్కిపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వలస వచ్చిన నాయకులన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పింఛన్లను దశల వారీగా పెంచుతుందని తెలిపారు.
రైతుబంధు డబ్బులను కూడా ఎకరానికి రూ.16వేల వరకు పెంచుతామని, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 65 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం పదేండ్లలో జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించినట్లు గుర్తుచేశారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ వాజిద్‌అలీ, వైస్ ఎంపీపీ మనోహర్, నర్సింహారెడ్డి, హరీన్, సంగమణి, రాములు నర్సింహులు, మాలిష్ రాజు, సురేశ్, నరేశ్, అఫ్జల్, జీవన్, మనీశ్‌రెడ్డి, చందర్, విఠల్, లింగాల శంకర్, ఆమేర్, మొహీజ్ తదితరులు పాల్గొన్నారు.