వేల్పూర్, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని మాట్లాడడం ఏమిటని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. వేల్పూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉండగా.. ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.
సొంత పార్టీ నాయకులే సీఎం పేరు మర్చిపోతున్నారని, ఫస్ట్రేషన్లో ఉన్న రేవంత్.. మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఎన్నో పదవులను గడ్డిపోచలా వదిలేసి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని, ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారన్నారు. కేసీఆర్ రాష్ట్రం సాధించకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యే వాడా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయినా ఇంకా తీరు మారలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి గా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డిని శాశ్వతంగా బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినా.. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సర్వే అంతా బోగస్ అని, రాష్ట్రంలో రీ సర్వే చేపట్టాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేక చాలా మంది సర్వేలో పాల్గొనలేదని, పాల్గొన్న వారు కూడా సరైన వివరాలు వెల్లడించలేదన్నారు. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు.. వ్యక్తిగత వివరాలు అడుగుతారా..? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టింది తప్పుడు సర్వే అని అన్ని బీసీ సంఘాలు విమర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీల జనాభా ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పే వారే లేరన్నారు. ఇకపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై పిచ్చికూతలు కూయడం ఆపేయాలని హెచ్చరించారు. సమావేశంలో పచ్చలనడ్కుడ సొసైటీ చైర్మన్ లింబారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, మాజీ సర్పంచ్ రమేశ్, నాయకులు గంగారెడ్డి, సంతోష్, డొల్ల రాజేశ్వర్ పాల్గొన్నారు.
మోర్తాడ్, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహరాజ్‌ను ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంలో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు రాధాకిషన్, బోగ ఆనంద్, ఏనుగు రాజేశ్వర్, సంతోష్, సందీప్, తుక్కాజీ పాల్గొన్నారు.