డిచ్పల్ల్లి, ఏప్రిల్ 11 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లు జనరంజక పాలన అందించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. వరంగల్ ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి డిచ్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైపోతున్న తెలంగాణకు విముక్తి కల్పించడానికి, తమకు అందాల్సిన హక్కులను కోల్పోతున్న ప్రజల కోసం రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ ఒక్కడిగానే బయల్దేరారని గుర్తుచేశారు. ఉద్యమంలో తాను వెనక్కి పోతే రాళ్లతో కొట్టండని సబ్బండ వర్ణాలను ఏకతాటిపై తీసుకొచ్చారని తెలిపారు. 14 ఏండ్లు మడమ తిప్పని సుదీర్ఘ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ తొలి సీఎం గా కేసీఆర్ పదేండ్లపాటు జనరంజక పాలన అందించి, అనేక రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. రాష్ర్టాన్ని కరెంట్ కోతల నుంచి గట్టెక్కించి తాగు, సాగునీటి బాధల నుంచి విముక్తి కల్పించి కునారిల్లుతున్న వ్యవసాయ రంగాన్ని పండుగ చేసి ప్రతిరైతునూ ఆదుకున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ర్టాన్ని ధ్వంసం చేస్తున్న అధికార పార్టీ నాయకులకు గూబ గుయ్యుమనేలా సమాధానం చెప్పడానికి వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు వరంగల్ సభకు లక్షలాదిగా తరలిరావాలని కోరారు. ప్రజలు సభకు వచ్చేలా వారిలో స్ఫూర్తి నింపేలా గ్రామ గ్రామాన వాల్‌పోస్టర్లు, వాల్పెయింట్ వేయించాలన్నారు. ఏడాదికాలం పాటు పార్టీ కార్యక్రమాలు, ప్రజల పక్షాన పోరాడే కార్యక్రమాలు ఉంటాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వేముల పిలుపునిచ్చారు.
రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు డిచ్పల్లి మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నాయకులు నల్లవెల్లి సాయిలు, శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, పద్మారావు, నడ్పన్న, సుందర్, గీత, బుచ్చమ్మ, సరిత, నయీం, అక్బర్‌ఖాన్, యూసుఫ్, రాథోడ్, గిరి, జాకీర్, పాషా, శంకర్, తిరుపతి, లక్ష్మణ్, సుఖేందర్, సంతోష్, ప్రవీణ్, ఒడ్డెన్న, రమేశ్, హన్మంత్‌రెడ్డి, శ్రీనివాస్, ముత్యంరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.