మోర్తాడ్/వేల్పూర్, డిసెంబర్ 22: కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రంతోపాటు పచ్చల నడ్కుడ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు అందరు ఒకపార్టీకి చెందిన వారే ఉండరని తెలిపారు.
ఎన్నికల వరకే పార్టీలని, తర్వాత పాలకవర్గసభ్యులందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంగా గెలుపు అందుకున్న కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు వారి మన్ననలను పొందాలన్నారు. ఎమ్మెల్యేగా తాను కేవలం అభివృద్ధి పంథాను నమ్ముకున్నానని అందుకే ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో సర్పంచులుగా బోగ ఆనంద్, కొత్తపల్లి హారిక, మొండి అశోక్ ప్రమాణస్వీకారం చేశారు.