ముప్కాల్, నవంబర్ 12: క్రీడలతో శారీరక దృఢత్వం సాధ్యమని, గెలుపోటములు తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరాలో 69వ ఎస్జీఎఫ్ మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడా పోటీలను ఆయన బుధవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కొత్త మండలంగా ఏర్పడిన మెండోరాలో క్రీడా పోటీలను ఇంత గొప్పగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. విద్యాసాగర్ రెడ్డి, రాజ్‌కుమార్, మల్లేశ్ వంటి క్రీడా ప్రేమికులతోనే ఇంకా క్రీడలు సజీవంగా ఉన్నాయన్నారు.
క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. తమ తండ్రి సురేందర్‌రెడ్డి, తాను, తన చెల్లెలు కూడా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నట్లు చెప్పారు. బాల్కొండలో జాతీయస్థాయి క్రీడలు నిర్వహిస్తే తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. మార్చ్ఫాస్ట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికను అందజేశారు. డీవైఎస్వో పవన్, పీఈటీ విద్యాసాగర్, ఎంఈవో మల్లేశ్, రాజ్‌కుమార్, శేఖర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు, వీడీసీ బాధ్యులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.