మోర్తాడ్, జూలై 4: రాష్ట్రంలో రేవంత్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ రాష్ర్టానికి మోక్షం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది అని ఖర్గేతో అందమైన అబద్ధాలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాట్లాడించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన పేపర్ చదవడం కాదని, క్షేత్రస్థాయిలో తిరిగితే కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందో నిజాలు తెలుస్తాయని ఖర్గేకు సూచించారు. కాంగ్రెస్ ఏం చెబుతుందో అది చేసి చూపెడుతుందని ఖర్గే అంటున్నది నిజమని, ఢిల్లీ కాంగ్రెస్ డబ్బుల మూటలు పంపుమని చెబుతుందని, రాష్ట్ర కాంగ్రెస్ అది చేసి చూపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలుచేయడం చేతకాదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెట్టిన క్యాంటీన్లకు పేర్లు మార్చడం, నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి రిజల్ట్ ఇస్తే ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చి తామే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కట్టించిన ఫ్లైఓవర్లను ప్రారంభించి తామే కట్టించామని గొప్పగా చెప్పుకోవడం చూస్తుంటే, మందికి పుట్టిన బిడ్డను మాబిడ్డనే అని ముద్దాడినట్టుగా రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు ఈరోజున నిరసనకు ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నిస్తున్న వారినెందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టినట్టు కాదని, ఒక్కసారి అశోక్ నగర్ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. రేవంత్‌రెడ్డి పాలనలో చేసిందేమీలేదని, వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవడం తప్ప పాలన చేతకాదని విమర్శించారు. బట్టలూడదీసి కొడు తాం… పేగులు మెడలేసుకుంటాం.. నాలుక చీరేస్తాం.. అంటూ మాట్లాడుతున్నాడంటే సీఎం ఏంటన్నది ప్రజలే అర్ధం చేసుకుంటారని పేర్కొన్నారు. పెట్టింది పార్టీ మీటింగ్, ఉద్దేశం సామాజిక న్యాయ సమరభేరి అని, కానీ దాని గురించి మాట్లాడింది ఆవగింజంత మాత్రమే అని తెలిపారు.
పెద్దల ఎదుట ప్రాబల్యం చాటుకునేందుకు రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం కొండంతలా ఉందన్నది దీంతో స్పష్టమయ్యిందని పేర్కొన్నారు. మగధీర సినిమాలో మాదిరిగా వందకు ఒక్కటి తగ్గకుండా ఎమ్మెల్యేలను గెలిపిస్తా, తానే సీఎంగా ఉంటా అనే ఊహాలోకంలో రేవంత్‌రెడ్డి విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు లాగిపెట్టి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు.