మోర్తాడ్, ఏప్రిల్ 16: బాల్కొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ముఖ్యమైన అభివృద్ధి పనుల పురోగతిపై దృష్టిసారించి, పూర్తిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన భీమ్‌గల్‌లో కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి బుధవారం వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. భీమ్‌గల్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌తోపాటు వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని కోరారు. చిట్టాపూర్-సుర్బిర్యాల్-ఫతేఫూర్ లిఫ్ట్ పనులను పూర్తిచేయించాలని కోరారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ బ్యాక్షోర్లో ఐలాండ్స్, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని, ఈప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధంచేసి ఇరిగేషన్ ల్యాండ్స్ టూరిజం వారికి బదిలీ కూడా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నదని పేర్కొన్నారు. అలాగే ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పైభాగంలో బాసర సరస్వతీ పుణ్యక్షేత్రం ఉందని, ఎస్సారెస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. నింబాచల లక్ష్మీనర్సింహా ఆలయ అభివృద్ధి కోసం ఎండోమెం ట్, టూరిజం ప్రాజెక్ట్ కింద రూ.25కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు.