ఖలీల్‌వాడి, నవంబర్ 26: ఉద్యమ స్ఫూర్తిని మంటగలిపేలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో వేముల మాట్లాడారు. తన పదవులను త్యాగం చేసి, కేసీఆర్ అప్పట్లో చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ర్టానికి ఉనికి ఉన్నదన్నారు. తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేలా, ఆంధ్ర పెత్తందారుల మోచేతి నీళ్లు తాగుతూ రేవంత్‌రెడ్డి పరిపాలిస్తున్నారని అన్నారు.
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, ఆమె చేతిలోని బతుకమ్మను తీసేయడం, తెలంగాణ అమరవీరులను స్మరించుకునేందుకు కేసీఆర్ కట్టించిన తెలంగాణ అమరుల స్మారక జ్యోతి ప్రాంగణానికి తాళం వేయడం, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్యానాథన్ను తెలంగాణ ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా నియమించడం వంటి అనేక తప్పుడు నిర్ణయాలను రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరోసారి ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మండలం నుంచి వంద, కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్ నుంచి 50 మంది కార్యకర్తల చొప్పున హాజరై, రేవంత్‌రెడ్డి సర్కారుకు చెమటలు పట్టేలా విజయవంతం చేయాలని కోరారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాడని వేముల విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా.. పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి బుజ్జగించినట్లు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్న గ్రామాల్లోనే చీరలు పంచుతున్నారని, మున్సిపాలిటీల్లో పంచడం లేదన్నారు. ఐదు లక్షలు దాటిన రుణాలకు వడ్డీ ఉంటుందని, వడ్డీ లేని రుణాలు కూడా గ్రామాల్లోని మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తున్నారని, ఈ విషయాన్ని మహిళలు గమనించాలన్నారు. రైతులకు కూడా రుణమాఫీ ఎగ్గొట్టాడని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ప్రస్తుతం చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాం గ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని తెలిసి కూడా బీసీలను మభ్య పెట్టారన్నారు. కేంద్రంలోని బీజేపీని కాంగ్రెస్ నిలదీయకుండా.. ఇక్కడ రోజుకో డ్రామా ఆడుతున్నదని మండిపడ్డారు. బీసీలు ఆ రెండు పార్టీలకూ తగిన గుణపాఠం చెప్పాలన్నారు.