ముప్కాల్, నవంబర్ 24 : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్కాల్ మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని, మహిళలకు రూ.2,500, పెన్షన్ రూ.4వేలకు పెంపు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని చీరల పంపిణీ ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌కు చెందిన 199 ఫైళ్లపై ఎమ్మెల్యే వేముల సంతకాలు చేశారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్‌కు సూచించారు.