మోర్తాడ్, మార్చి17: పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించేలా చూ డాలన్నారు. సోమవారం అసెంబ్లీలో జీరో అవర్ లో పసుపు రైతుల సమస్యలను ప్రశాంత్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గాల రైతులు, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖనాపూర్ నియోజకవర్గాల రైతులు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల రైతులు పండించిన పసుపును విక్రయించేందుకు నిజామాబాద్ గంజ్‌కు తీసుకువస్తారన్నారు.
ఈ సీజన్ ప్రారంభంలో నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్ పసుపు రూ.12 వేలకు అమ్ముడు పోగా, ప్రస్తుతం రూ.8వేలకు పడిపోయిందన్నారు. ఇదే పసుపును మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కి తీసుకెళ్తే రూ.14 వేల వరకు ధర వస్తున్నదని చెప్పారు. నిజామాబాద్ మార్కెట్లో ఖరీదుదారులు సిండికేట్ అయి, అధికారుల సహకారంతో ధరను తగ్గిస్తున్నారని ఆరోపించారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గిస్తున్నందునే ఈమధ్య రాజకీయాలకు అతీతంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారని తెలిపారు.
ఒకే రకమైన పసుపునకు నిజామాబాద్‌లో ఒక రేటుకు, సాంగ్లీ మార్కెట్లో మరో రేటుకు అమ్ముడుపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి వే ముల విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యనే పసుపుబోర్డు ఏ ర్పాటు కావడంతో రైతులు మద్దతు ధర వస్తుందని ఆశించారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు. బీజేపీ వాళ్లు పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ మేనిఫెస్టోలో పసుపు రూ.12 వేలకు కొంటామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఖరీదుదారులు సిండికేట్‌గా ఏర్పడి ఆన్లైన్లో రెండు, మూడు కుప్పలు కొని మిగతావి కొనకపోవడంతో రైతులు చివరకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా తీవ్ర నష్టాలకు గురికావాల్సి వస్తున్నదని వివరించారు. సిండికేట్ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించడంతోపాటు సాంగ్లీ మార్కెట్లో లభించే ధర నిజామాబాద్ మార్కెట్లో కూడా లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, పసుపుబోర్డుతో మాట్లాడి వాళ్లు చెప్పినట్లుగానే రూ.15 వేల మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.12 వేల మద్దతు ధర చెల్లించాలని, లేదా రైతు తెచ్చిన పసుపు రూ.9 వేలకే అమ్ముడు పోతే అటువంటి వారికి రాష్ట్రప్రభుత్వం రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.