మోర్తాడ్, ఆగస్టు 2: ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందర యువతను వాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దారుణంగా మోసగించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట జాబ్‌ల సంఖ్య లేని బోగస్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా అసెంబ్లీలో విడుదల చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్‌పై సభలో చర్చ జరపాలని కోరితే తేదీలు ప్రకటించి తప్పించుకున్న ప్రభుత్వానికి యువత బుద్ధి చెప్పాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 1.63 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్న వేముల.. తాము వేసిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలకు సంబంధించిన నియామకపత్రాలు ఇచ్చి మంది బిడ్డ మాబిడ్డ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది ఎద్దేవా ఎన్నికలకు ముందు అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా యూనివర్శిటీలోని యువకులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరమే 2లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్‌క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నమ్మించారన్నారు.
ఎన్నికల్లో ఊరూరా తిప్పి పార్టీ గెలుపు కోసం వాడుకుని ఇప్పుడు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం నిరుద్యోగ యువతను వాడుకున్న రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఓయూకు వచ్చి యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.