మోర్తాడ్, జూలై 14: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు ఛీదరించుకునే స్థాయికి దిగజారారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏడాదిలోపు రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చేతకాక తీరా ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు రాబోయే రెం డేండ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట మార్చిన రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేయడం కాదా అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పచ్చి మోసకారి అని, అబద్ధాల కోరు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక పూర్తి చేయగా..వారికి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధాన్నే మళ్లీమళ్లీ చెప్పడం అబద్ధాల కోరుతనం కాదా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదంటున్న రేవంత్‌రెడ్డి, పదేండ్లలో ఆరులక్షల రేషన్‌కార్డులు ఇచ్చామ ని, చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వరి బోనస్ రూ.500, రుణమాఫీ పూర్తిగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుభరోసా రెండుసార్లు ఎగ్గొట్టి, స్థానిక ఎలక్షన్లు ఉంటాయని మొన్న ఇచ్చావన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
రేవంత్ పాలనలో వ్యవసా యం పండుగ అయితే 18నెలల కాలంలో 700మంది రైతుల ఆత్మహత్యలు ఎం దుకు జరిగాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దామని, ఆరుగ్యారెంటీలు, 420 హామీల్లో ఏవీ సక్రమంగా అమలు అవుతున్నాయో ప్రజల మధ్య చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాళేశ్వరం లిఫ్ట్‌లు ప్రారంభించి నీళ్లు లిఫ్ట్ చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని పనిగట్టుకుని ప్రాజెక్ట్‌పై కుట్రలు చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వర్షాభావ పరిస్థితులు ఉన్నా ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వినియోగంలోకి తేకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నావని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా చేస్తే, రేవంత్‌కు పాలన చేతకాక రాష్ర్టాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడడం ఖాయమని పేర్కొన్నారు.