మోర్తాడ్, డిసెంబర్ 28: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గల్లంతు కావడంతో, ఆ పార్టీ ఎంపీ అర్వింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వేముల ఆదివారంఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో బీజేపీ పేరు చెబితే జనాలంతా నేలకేసి కొడుతున్నారని, అందుకు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను తానే గెలిపించానని చెప్పుకునే అర్వింద్.. తనకు సత్తా ఉంటే సర్పంచులను ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే స్వగ్రామం, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సొంత గ్రామంలో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని అర్వింద్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మతం పేరిట జనాలను రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు లబ్ధిపొందే బీజేపీకి గ్రామస్థాయిలో సరైన రీతిలో జవాబు దక్కిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్న విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే అని, రెండేండ్లుగా నిరాధార ఆరోపణలతో ఆ పార్టీలు తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కట్టడి చేయాలని కలిసి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రెండేండ్లుగా అధికారంలో ఉండి పాలనలో విఫలమైనది కాంగ్రెస్ ప్రభుత్వమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని, కానీ ఆయనను విమర్శించలేక ఇంకా బీఆర్ఎస్, కేసీఆర్‌పై బురదజల్లడమే బీజేపీ ఎంపీలు, నాయకులకు పనిగా మారిందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తూ కేసీఆర్ పై ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా ఎంపీ అర్వింద్.. కేసీఆర్, బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం మానుకోవాలని వేముల హెచ్చరించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి భంగపాటు తప్పదని పేర్కొన్నారు.
ఉద్యమనేతగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎంపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించింది కేసీఆర్ అని పేర్కొన్నారు. కానీ తెలంగాణకు నిజమైన పెద్ద దోఖేబాజీ బీజేపీ అని, ఈవిషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం ఏడు శాతంలోపే సర్పంచులుగా గెలిచినా, గొప్ప విజయాలు సాధించినట్లు అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇలాంటి ఫలితాలతో బీజేపీ సత్తా చాటిందని చెప్పకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. తెలంగాణ బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా రాష్ర్టానికి వారు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అర్వింద్ చౌకబారు విమర్శలు మానుకుని, కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు.