మోర్తాడ్, ఏప్రిల్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన తెస్తామని చెప్పారని, కానీ బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడులతో భయపెట్టాలని చూడడం అదంతా అధికార పార్టీ నేతల అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులే కొట్టి, వారే కేసులు పెడతారని, ఇది ప్రజాపాలనా లేక పోలీసు పాలనా అని ప్రశ్నించారు.
ఇటీవల భీమ్‌గల్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, పోలీసు లాఠీచార్జి, అక్రమ కేసుల నమోదు తదితర పరిణామాలపై వేముల శుక్రవారం సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఇటీవల భీమ్‌గల్‌కు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం, ప్రతి మహిళకు రూ.2500, వృద్ధులకు, బీడీకార్మికులకు రూ.4వేలు ఎప్పుడిస్తారని అడిగామని తెలిపారు.
నియోజకవర్గంలో ఇంకా 31వేల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదని, ఎప్పుడు చేస్తారని, రైతుభరోసా ఎందుకు వస్తలేదని, బోనస్ ఎందుకు ఇవ్వడంలేదని అడిగినట్లు చెప్పారు. రైతుభరోసాను ముఖ్యమంత్రి మార్చి 31 లోపు వేస్తామని చెప్పారని, ఇప్పటికీ రైతుల ఖాతాలో ఆ డబ్బులు ఎందుకు జమకాలేదని, ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారని అడిగితే సభలోపల కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారని తెలిపారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారని సభ బయట ప్లకార్డులు పట్టుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయగా.. పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి చేయడం అమానుషమన్నారు.
తమ పార్టీ కార్యకర్తలపై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. సునీల్‌రెడ్డి కేసులు పెట్టాలని ప్రెస్మీట్లో చెప్పగానే, పోలీసులు ఆగమేఘాల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు, తనతోపాటు 33 మందిపై అక్రమకేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులే కొడతారని, వారే కేసులు పెడతారని ఇదేం పాలనా అని ప్రశ్నించారు. ప్రభు త్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని అడగడం ప్రతిపక్షపార్టీగా తమ బాధ్యత అని, అందులో తప్పేముందని అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది వారి ఇంటి కోసం, వారి అవసరాల కోసం కాదని.. ప్రజలు, మహిళలు, రైతులు గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వపెద్దలు, పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, తమ ఆత్మైస్థెర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరని, ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, కసితో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. లాఠీ దెబ్బలతో తమను భయపెట్టలేరని, తమ పోరాటానికి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, రైతన్నలు అండగా నిలువాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు.