వేల్పూర్, జూన్ 1 : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండలంలోని పడిగెల్ గ్రామంలో రోడ్లపై వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని అక్కడి రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. 15 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఇంకా తమ వడ్లను కొనుగోలు చేయడంలేదని రైతులు.. వేముల ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ కల్లాలు, రోడ్లపై వడ్లు అలాగే ఉండడంతో అకాల వర్షాలకు తడిసి మొలకలు రావడంతో పూర్తిగా పనికి రాకుండా పోయాయన్నారు. తడిసిన ధాన్యాన్ని అటు ప్రభుత్వం ఇటు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో కిలో నాలుగైదు రూపాయలకు రైతులకు విక్రయించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతోనే రైతులు తీవ్ర కష్టాలు పడుతు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అందాల పోటీల కోసం ఎనిమిదిసార్లు అధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్.. పంటల కొనుగోలుపై సమీక్ష చేసే సమ యం లేదా అని ప్రశ్నించారు.
నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు, మిల్లర్లపై ఎలాంటి నియంత్రణ లేదని ఎద్దేవా చేశారు. సరైన సమయంలో వడ్లు కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వేముల డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. అయినా ఆనాడు నిరాధారంగా అడ్డగోలు విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
తడిసి, మొలకలు వచ్చిన ధాన్యం పరిశీలిస్తున్న సమయంలో ఆదివారమే కొనుగోలు చివరిరోజు అని, సోమవారం నుంచి కొనుగోలు చేయబోమని అధికారులు అంటున్నారని పలువురు రైతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వేముల వెంటనే అక్కడి నుంచే కలెక్టర్‌కు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. పడగల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగుతున్నదని, మరో మూడు నాలుగు రోజులు సెంటర్ అలాగే కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు అయ్యేలా చూడాలని కలెక్టర్‌ను కోరా రు. రేపటి నుంచి వడ్లు కొనుగోలు చేయబోమంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్న ఐకేపీ అధికారిని ఎమ్మెల్యే మందలించారు. ఇలా చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.