త్యాగం.. తెలుగు కథానాయికకు కొత్తకాదు. అహంకారం.. మన హీరోయిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ రెండు గుణాల మేలు కలయికతో ఓ పాత్ర రూపుదిద్దుకుంది. ఆమె త్యాగం నిరుపమానమై.. అందరి జేజేలు అందుకుంది. ఆమె అహంకారం.. నాటి, నేటి అతివకు అలంకారమై నిలిచింది. దర్శకుడు కె.బాలచందర్ సృష్టించిన సరిత పాత్ర… ఇప్పటికీ అక్కడక్కడా తారసపడుతూనే ఉంటుంది. పుట్టెడు సంసారాన్ని
పట్టెడు జీతంతో నెట్టుకొచ్చిన పడతి వ్యథను.. సరిగ్గా యాభై ఏండ్ల కిందట ‘అంతులేని కథ’గా ఆవిష్కరించాడు ఆ దర్శకుడు. 1976 ఫిబ్రవరి 27న విడుదలై వెండితెర చిత్రరాజంగా వెలిగిన ‘అంతులేని కథ’ కహానీ ఇది..

సరిత (జయప్రద) రాక్షసి..
ఆ ఇంట్లో పిల్లల అభిప్రాయం.
సరిత గయ్యాలి, పెద్దపులి..
ఇది ఇంట్లోని పెద్దల దురభిప్రాయం.
తాగుడు, వాగుడు తప్ప మరేం పట్టని
అన్న అభిప్రాయం మరింత నీచం.
ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలే!
సరిత ఏమిటో.. తనకు తప్ప ఆమెను ప్రేమించిన వాడికీ తెలియదు. ఆకలితో చూసే కళ్లకు ఆడదాని మనసు ఏం తెలుస్తుంది? అందుకే, తన చుట్టూ ఉన్న అడ్డుతెరలను అహంకారంతో ఎదుర్కొంటుంది సరిత. కోపాన్ని కొనితెచ్చుకుని నిప్పుకణికగా మారిన కన్నీటి చుక్క ఆమె.

అంతులేని కథ.. బాలచందర్ అపూర్వ సృష్టి. అప్పుడప్పుడే ఆడపిల్లలు ఉన్నత చదువుల కోసం గడపదాటడం మొదలైంది. టైపింగ్ నేర్చుకోవడాలు ప్రారభమైంది. ఉద్యోగాలు చేయడం అలవాటైంది. అలాంటి కాలంలో వచ్చింది అంతులేని కథ. ఇంటి బాధ్యత నెత్తిన పడిన ఓ ఇంతి పోరాటం ఈ సినిమా. అందుకోసం సరిత అనే యువతి చుట్టూ అనుబంధాల ఉచ్చు బిగించేశారు దర్శకుడు.
సరిత అందరిలాంటి ఆడపిల్లే. చిన్ని చిన్ని సంతోషాలకే పొంగిపోయేంత అమాయకురాలామె. చెట్టంత అన్న ఉన్నా.. బండెడు సంసారాన్ని భుజాన మోస్తుంటుంది. తన పెళ్లాం, పిల్లల బాగోగులు చూస్తున్న చెల్లిని ఆ అన్న బజారుమనిషి అనేస్తాడు. ‘బాధ్యతలు తీసుకో.. నువ్వు గీసిన గీత దాటన’ంటుంది సరిత. తనను నిందించినా.. ఇంటి పెత్తనంలో ఆడవారి మాట ఇక చెల్లదన్న అన్నకు బాధ్యత గుర్తొచ్చిందని మురిసిపోతుంది. మర్నాడు సాయంత్రానికి తాగి వచ్చిన అన్నను చూసి తన తలరాత ఇంతేనని బాధపడుతుంది. మళ్లీ ఇంటికి వస్తున్నానంటూ నాన్న రాసిన జాబు చూసి ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఇక తనకు ఉద్యోగం చేయాల్సిన పని లేదని నలుగురికీ చెప్పుకొంటుంది. ఎప్పుడూ సిద్ధంగా ఉండే రాజీనామా పత్రం ఇన్నాళ్లకు ఉపయోగపడుతుందని సంబరపడుతుంది. అపారమైన సంపద (జ్ఞానం, భక్తి)తో సన్యాసిగా వచ్చిన తండ్రిని చూడగానే ఈ బాధ్యతలు తప్పవని మళ్లీ పరిస్థితులతో రాజీ పడిపోతుంది.

సరిత.. బాలచందర్ ఊహల్లో నుంచి పుట్టిన వనిత. అందులో ఆయన జయప్రదను ఎలా ఊహించుకున్నారో గాని.. ఈ సినిమాతో ఆమెకు స్టార్డమ్ వచ్చేసింది. సరిత క్యారెక్టర్ చేయాలని బాలచందర్ అడిగినపుడు జయప్రద ఆశ్చర్యపోయిందట. అంత సీరియస్ రోల్ చేయగలనా అని సందేహ పడిందట. ఎందరి జీవితాలనో మార్చే పాత్రను బాలచందర్ తనకిచ్చారని సినిమా రిలీజయ్యాక కానీ ఆమెకు అర్ధం కాలేదు.
ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లలోనే జయప్రద గొప్పనటిగా స్థిరపడేలా చేసింది అంతులేని కథ. తొలిపరిచయంగా వచ్చిన రజనీకాంత్ ఏ పట్టింపూ లేనివాడిగా, చివర్లో బాధ్యతలెరిగిన అన్నగా అద్భుతంగా మెప్పించాడు.
తనలో ఎంత సత్తా ఉందో ‘దేవుడే ఇచ్చాడు..’పాటలో చూపించేశాడు. వికటకవి గోపాల్‌గా అందరి మన్ననలు అందుకున్న నారాయణరావుకు ఇదే తొలిసినిమా. 1974లో వచ్చిన తమిళ అంతులేని కథలో కమలహాసన్ పోషించిన పాత్రను తెలుగులో నారాయణరావు పండించాడు. ‘తాళికట్టు శుభవేళ..’ అంటూ ఇప్పటికీ వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాడు. అతిథి పాత్రలో కమలహాసన్ అలా మెరిసిపోతారు. సినిమాలో ఫట్ఫట్లాడించిన చంద్ర పాత్ర ఆ తర్వాత ఫటాఫట్ జయలక్ష్మిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. వీరందరితో బాలచందర్ మధ్యతరగతి మహాభారతాన్ని తెరమీద ఆవిష్కరించారు.

సాధారణంగా బాధ్యతలు తీరేకొద్దీ మనసు తేలికవుతుంది. కానీ, మనిషి మదిని, ఆ మనసు వ్యథని చూపించడంలో బాలచందర్ ఎవరికీ అంతుపట్టని పంథాను అనుసరిస్తారు. అందుకే ఒక్కోబాధ్యత తీరేకొద్దీ సరిత హృదయం మరింత బరువెక్కేలా చూపించారు. తాను ప్రేమించిన వాడికి (ప్రసాద్ బాబు) విధవరాలైన చెల్లెలిని కట్టబెడుతుంది. మంచివాడిగా మారిన అన్న ఇంటిని చూసుకుంటాడనే ధైర్యంతో సరిత పెళ్లికి సిద్ధపడుతుంది. ఇంతలోనే ఆ అన్న శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి. మళ్లీ ఇంటి పెద్దగా నిలబడాలనుకుంటుంది. అందుకే తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్న బాస్ (కమలహాసన్)కు మరో చెల్లిని ఇచ్చి కల్యాణం జరిపిస్తుంది. ఇదీ సరిత అంతులేని కథ!

సినిమాలో మొదటి సీన్లో లాగే.. పతాక సన్నివేశంలోనూ సరిత తన గదిలో ముస్తాబవుతుంటుంది. ఆమె తల్లి సరితకు టిఫిన్ బాక్స్ సిద్ధం చేసేసి.. బియ్యం చెరుగుతూ ఉంటుంది. గుడ్డి తమ్ముడు బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. అన్న కొడుకు పుస్తకాలకు అట్టలు వేసుకుంటూ ఉంటాడు. అన్న కూతురు కూరగాయలు కోస్తూ ఉంటుంది. విధవగా మారిన వదిన మెషిన్ మీద బట్టలు కుడుతూ ఉంటుంది. సరిత బాక్స్ తీసుకుని ‘నేను ఆఫీస్‌కు వెళ్లొస్తానమ్మా’ అంటూ మళ్లీ తన అంతులేని ప్రయాణం మొదలుపెడుతుంది. మొదటి సీన్లో సరిత అలా గడప దాటగానే ‘పెద్దపులి వెళ్లిపోయిందం’టూ ఇలా అందరూ ఊపిరిపీల్చుకుంటారు. చివరలో ఆ సన్నివేశం ఉండదు.
అంతులేని కథ వచ్చి 50 ఏళ్లు దాటింది. ఆనాడు సరితకున్నన్ని కష్టాలు ఈనాడు కొందరికి ఉండకపోవచ్చు. ఆమెకన్నా ఎక్కువ కష్టాలతో పోరాడుతున్న వాళ్లూ ఉండొచ్చు. ఇందులో సరిత కథను మధ్యలోనే వదిలేసినట్టు కనిపిస్తుండొచ్చు. కానీ, ఎలాంటి సమస్యలున్నా సరితలాంటి వ్యక్తిత్వం ఉంటే చాలు ఆమె ఆత్మాభిమానం, తెచ్చిపెట్టుకున్న అహంకారం నేటి వనిత అనుసరించదగ్గదే. సరిత కథలో బాలచందర్ చూపించిన సూక్ష్మమూ ఇదే.

అన్నీ హిట్ సాంగ్సే. అన్నీ ఆత్రేయ రాసినవే. ఈ సినిమాకు పాటలే కాదు.. మాటలు కూడా ఆయనే రాశారు. సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్ సమకూర్చారు.
– కణ్వస