భీమ్‌గల్, నవంబర్ 12: కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.
ఆ పథకాన్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేముల హాజరయ్యారు. 224 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ మొదటగా రూ.50వేల నగదుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.
తర్వాత అన్ని వర్గాలకూ రూ.లక్షా నూటపదహారు అందించారని చెప్పారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు దాటిందన్నారు. ఇప్పటివరకు తులం బంగారం ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన లబ్ధిదారులందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ. ఐదువందల బోనస్, రైతు భరోసా అమలుచేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు లేనిపోని కొర్రీలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బదులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాల తయారీ, హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రమంటూ అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ తీరులాగే.. ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకుల తీరుకూడా అలాగే ఉందంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెడుతారని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అధికారికంగా, ప్రొటోకాల్ ప్రకారం వేముల పంపిణీ చేశారు. అయితే లబ్ధిదారుల నుంచి అవే చెక్కులను స్థానిక నాయకులు తిరిగి తీసుకొని మళ్లీ వారికి పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారులు అవాక్కై, వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంతలా ఫొటోలు దిగాలని ఉంటే ముందుగా తులం బంగారం ఇప్పించేలా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని సూచించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన అనంతరం వేముల పాత్రికేయులతో మాట్లాడుతుండగా..స్థానిక కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారు. ‘మీ పిట్ట అరుపులకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని, మీరు ఇక్కడ అరిచే అరుపులు సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర అరవాలని అప్పుడు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి పనికివస్తాయని,’ వేముల వారికి హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసే వరకూ బీఆర్ఎస్ తరపున వెంటపడుతామని వేముల స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, వైస్ చైర్మన్ భగత్, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, భీమ్‌గల్ విండో చైర్మన్ నర్సయ్య, కౌన్సిలర్లు నర్సయ్య, సతీశ్, లింగయ్య,కో-ఆప్షన్ మెంబర్ నవీన్ తదితరలు పాల్గొన్నారు.