మోర్తాడ్, ఏప్రిల్ 17: రుణమాఫీ చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, రైతులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు.
రుణమాఫీ చేయాలని అడిగిన బీఆర్ఎస్ నాయకులు, రైతులపై గతంలో కేసులు నమోదు చేయగా శుక్రవారం వారు ఆర్మూర్ కోర్టుకు హాజరయ్యారు. రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వేముల పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 52వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22వేల మందికి మాత్రమే చేశారని తెలిపారు.
ఇంకా 30వేల మందికి రుణమా ఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులు, రైతులపై అక్రమకేసులు పెట్టి రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను కోర్టుల చుట్టూ తిప్పించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉప సంహరించుకోవాలని, పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చే యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వేముల హెచ్చరించారు.