నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మమ్మల్ని మీరు(రైతులు) మన్నించాలి. మార్చి 31 లోపు రైతు భరోసా వేస్తామని అనుకున్నాం. మేం అనుకున్నది ఆలస్యం అయ్యింది. తప్పకుండా అతి త్వరలోనే మిగిలిన రైతుభరోసా మీ ఖాతాల్లో జమ చేస్తాం..’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.
అనంతరం మంత్రులు మాట్లాడారు. మార్చి 31లోపు రైతుభరోసా వేస్తామని ప్రకటించి నవ్వుల పాలైన మంత్రులు ఇప్పుడు ధాన్యం కోతకు వచ్చిన సమయంలో రైతుభరోసా వేస్తామంటూ మరోసారి ప్రకటించారు. తుమ్మల మాట్లాడుతూ.. కుటుంబం అన్నాక కష్టాలుంటాయని, కష్ట కాలంలో, కరువు కాలంలో ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అలాంటిదే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అయినా సరే రూ.33వేల కోట్లను ఒకే ఏడాది రైతుల జేబుల్లోకి పంపించామంటూ చెప్పారు. పంట నష్టాన్ని త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని, ఆఫ్ అండ్ ఆన్ పద్ధతిలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు భారీగా దిగుబడి సాధించి ఘనత సాధించారన్నారు. మూడునాలుగేండ్లలో ఆయిల్ పాం కంపెనీలు వస్తాయని, వరి పంట సాగు కాకుండా ఆయిల్ పాం వైపు రైతులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పసుపు బోర్డుతో రైతులకు లాభం జరిగేలా కేంద్ర సహకారంతో అనుబంధ రంగాలను ప్రోత్సాహిస్తామని తుమ్మల చెప్పారు. పసుపు రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పసుపు బోర్డు కృషి చేయాలని సూచించారు. పసుపు బోర్డును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.