నిజామాబాద్, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట రైతులు ధర్నా చేస్తున్న ఘటన నిత్యం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోం ది. అయినప్పటికీ పాలకులు ఎవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. యూరి యా కోసం ఘర్షణ పడాల్సి వస్తోంది. తెల్లవారుజాము నుంచే చెప్పులు లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు తేడా లేకుండా బస్తా యూరియా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.
చంటి పిల్లలను పట్టుకుని సొసైటీల వద్ద భారీ ఎత్తున బారులు తీరుతున్నారు. సొసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యపు సమాధానాలపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. రెండు సంచుల కోసం వస్తే ఒకటే సంచి ఇవ్వడంపై రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్న వారికి కేవలం ఒక బస్తాతో సర్దిచెబుతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. మాచారెడ్డి రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు ధర్నాలకు దిగారు. రామారెడ్డి, భిక్కనూర్, రాజంపేట, దోమకొండ, బీబీపేట మండలాల్లో యూరియా సమస్య వేధిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
కొరత పేరుతో సొసైటీల్లో దోపిడీ తంతు నడుస్తోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో చాలా చోట్ల ఈ వ్యవహారం నడుస్తున్నదని ప్రచారం జరుగుతోంది. కొరతను జేబులు నింపుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. యూరియా కొరత ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్దకు వెళ్లేందుకు సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు జంకుతున్నారు. తమపై రైతులు దాడి చేస్తారేమో? అన్న విధంగా భయపడి పోతున్నారు.
వాస్తవానికి యూరియా సమయానికి రాకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో ఈ రకమైన సమస్య ఉత్పన్నం కాలేదని ఇప్పుడే ఎందుకు సమస్య వెలుగు చూస్తున్నదని అన్నదాతలు అడుగుతుండగా సమాధానం కరువైంది. కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో యూరియా 68,658.25 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,222.4 మెట్రిక్ టన్నులు, ఎంవోపి 16,926 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 44,762 మెట్రిక్ టన్నులు మేర అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలున్నాయి. ఇందులో యూరియా మెజార్టీ భాగం రైతులకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం అంతుచిక్కడం లేదు.
కాంగ్రెస్, బీజేపీ ప్రజా ప్రతినిధులు కనీసం చీమ కుట్టినైట్లెనా స్పందించడం లేదు. కామారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం లో సలహాదారుగా షబ్బీర్ అలీ ఉన్నారు. ఒకరు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పార్టీకి, మరొకరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వారున్నప్పటికీ రైతుల గోడును ఆలకించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
యూ రియా కొరతపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూటకొక విధంగా విమర్శలు చేసుకోవడంతోనే సరిపోతుండగా ఇబ్బందిని తీర్చే పనిలో మాత్రం నిమగ్నం కావడం లేదు. కామారెడ్డి నియోజకవర్గంలో గడిచిన వారం, పది రోజులుగా నిత్యం యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కనీసం సమీక్ష నిర్వహించిన నేతలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. రెండు వారాల్లో మూడు సార్లు కామారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జీ మంత్రి సీతక్క పర్యటించారు.
ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లారు. అయినప్పటికీ రైతుల సమస్యను ఎవ్వరూ ఆలకించకపోవడం విడ్డూరంగా మారింది. సెప్టెంబర్ 4న కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్న సమయంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో రైతులంతా యూరియా కోసం అల్లాడిపోయారు. ఒకే రోజు విచిత్రమైన ఘటనలు సాక్షాత్కరించినప్పటికీ పట్టించుకునే నాథుడే కనిపించలేదు. సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ సీఎం దృష్టికి తీసుకెళ్లారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్ధకంగానే మారింది.