లింగంపేట/రామారెడ్డి (సదాశివనగర్)/భిక్కనూరు/బీబీపేట, సెప్టెంబర్1: ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఒక్కో సొసైటీకి ఒకటి లేదా రెండు లారీల లోడ్ రావడంతో రైతులందరికీ యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
కొన్నిచోట్ల యూరియా పంపిణీలో సొసైటీ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా..పోలీసు పహారా మధ్య అందజేస్తున్నారు. సోమవారం లింగంపేట మండలంలోని నల్లమడుగు సొసైటీకి యూరియా వచ్చినట్లు తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడ బారులు తీరారు. 450 బస్తాల యూరియా రాగా సొసైటీ పరిధిలోని నల్లమడుగు, కోర్పోల్, బాణాపూర్ గ్రామాలకు చెందిన రైతులు తరలి వచ్చారు. యూరియా పంపిణీ వద్ద ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు.
సదాశివనగర్ మండలం ఉత్తునూర్, సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని గ్రామాలకు యూరియా రాగా ఆదరాబాదరగా సోమవారం పంపిణీ చేశారు. యూరియా పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం తెలిసేలోపు స్టాక్ అయిపోయినట్లు బోర్డు పెట్టగా.. రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి ప్రజాప్రతినిధిని వివరణ కోరగా ఉత్తునూర్కు 330 బస్తాలు, అడ్లూర్ఎల్లారెడ్డికి 220, సదాశివనగర్‌కు 330 బస్తాలు వచ్చాయని, వాటిని రైతులకు సకాలంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.
భిక్కనూరు మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. సోమవారం జంగంపల్లి, పెద్దమల్లారెడ్డి విండోలకు యూరియా రాగా వేకువ జామున 4 గంటల నుంచే రైతలు బారులు తీరారు. క్యూలో నిల్చున్నా యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో యూరియా పంపిణీని నిలిపివేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని యూరియా పంపిణీని కొనసాగించారు. కొంతమంది రైతులకు మాత్రమే యూరియా లభించగా మిగతావారు నిరాశతో వెనుదిరిగారు.
బీబీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్దసంఖ్యలో బారులుతీరారు. సొసైటీకి 440 బస్తాల యూరియా రావడంతో పంపిణీ చేసినట్లు సీఈవో నర్సాగౌడ్ తెలిపారు.