ఖలీల్‌వాడీ, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గల్లీలో.. ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్లో బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభను మంగళవారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
దేశానికి వెన్నెముక రైతన్న అయితే.. రైతన్నకు వెన్నెముక సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు వివరించారు. తొమ్మిదేండ్లలో నిజామాబాద్ రూపురేఖలు మారాయని, పచ్చనిచెట్లు, అందమైన లైట్లు విశాలమైన రోడ్లతో నగరం స్వాగతం పలుకుతున్నదని వివరించారు. రైల్వేకమాన్ వద్ద ఆర్యూబీ నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించామని, ప్రతి కాలనీలో పార్కులు నిర్మించడంతో పచ్చని చెట్లతో విరాజిల్లుతుందన్నారు. నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మించామని, పలు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుని త్వరలోనే రానున్నాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, సీనియర్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాశ్, మీర్ మజాజ్ అలీ, నవీద్ ఇక్బాల్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.