ఇందల్వాయి/వర్ని/సిరికొండ/పెద్దకొడప్గల్/నస్రుల్లాబాద్, ఏప్రిల్ 3: ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి. మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన జోరువాన అన్నదాతలకు హైరానాకు గురి చేసింది. పంట కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవగా, కోతకొచ్చిన వరి నేలవాలింది. కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. కండ్ల ముందే వరద నీటిలో వడ్లు, మక్కలు కొట్టుకుపోతుంటే కన్నీటి పర్యంతమంతమయ్యారు.
యాసంగి పంటలు గట్టెక్కించుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడ్డారు. భూగర్భ జలాలు అడుగంటి సాగునీరందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. అనేక ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెట్టుకుంటూ పంటలను కాపాడుకున్నారు. సరిగ్గా కోత కోసే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి కాపాడుకున్న పంట నేలవాలడంతో తల్లడిల్లుతున్నారు.
పెద్ద కొడప్గల్ మండలంలో గురువారం మధ్యా హ్నం ఒక్కసారిగా జోరువాన కురియడంతో.. రోడ్ల పై మక్కలు, జొన్నలు కొట్టుకు పోయాయి. పొలాల్లో ఆరబెట్టిన జొన్నకంకులు తడిసి పోయాయి. ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో తమ పంట దెబ్బ తిన్నదని రైతులు వాపోయారు.
సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కుప్పల్లోకి వర్షపు నీరు చేరింది. ఆ నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిరికొండ మండలం చీమన్పల్లి, పందిమడుగు, గడ్కోల్, కొండూర్, కొండాపూర్, తూంపల్లి, న్యావనంది, రావుట్ల గ్రామాల్లో భారీ వర్షం కురియడంతో ధాన్యం కొట్టుకుపోయింది. కోతకొచ్చిన వరి నేలకొరిగి వడ్లు రాలిపోయాయి. చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు కంటతడి పెట్టుకున్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, నెమ్లి, బొమ్మన్దేవ్పల్లి, నస్రుల్లాబాద్ తదితర గ్రామాల్లోనూ ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయింది. బలమైన గాలులు వీయడంతో వరి నేలకొరిగింది. వర్ని మండలం శ్రీనగర్, జలాల్పూర్, వర్ని, జాకోర, కూనిపూర్, తగిలేపల్లి తదితర గ్రామాల్లో అకాల వర్షం కురియడంతో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్న ఉద్దేశంతో రైతులు వడ్లను రోడ్లపై ఆరబెట్టారు. అకస్మాత్తుగా వర్షం కురియడంతో ధాన్యం తడిసిపోయింది. తడిచిన ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు.
బిచ్కుంద, ఏప్రిల్ 3: మండల కేంద్రంతోపాటు మండలంలోని చిన్న దడ్గి,పెద్ద దడ్గి, మాన్యాపూర్, సీతారాంపల్లి, ఎల్లారం, శాంతాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. మామిడి నేల రాలింది, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పెద్దదడ్గి గ్రామంలోని సంజు అనే రైతుకు చెందిన ఐదెకరాల్లో వేసిన వరి పంట చేతికి వచ్చే దశలో ఉండగా నేలరాలింది.