హైదరాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు. తల, ఎడమ చేతి వేళ్లు, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా మృతదేహం ఉన్నది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మరో ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని భావిస్తున్నారు. హత్యకు గురైన వయస్సు 30 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.