నిజాంసాగర్, జనవరి 18: నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మొదటి ఆయకట్టు రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు. నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన రైతులు ఉత్సాహంగా పంటలు పండిస్తున్నారు. మరోవైపు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం మూడో విడుత నీటి విడుదల కొనసాగుతున్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీల) కాగా, ప్రస్తుతం రిజర్వాయర్లో 1401.30 అడుగులు (12.83 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. ఏడు రోజులుగా మూడో విడుత నీటి విడుదల కొనసాగుతున్నది. నవంబర్లో 15 రోజులపాటు మొదటి విడుత, డిసెంబర్లో రెండో విడుత కింద 2.95 టీఎంసీల నీటిని ఆయకట్టుకు విడుదల చేయగా ప్రస్తుతం మూడో విడుత నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు పంటలు గట్టెక్కేందుకు మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేయనున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఆరు విడుతల నీటిని మార్చి నెలాఖరు వరకు మొత్తం 11టీంఎంసీలను విడుదల చేయనున్నారు. నవంబర్లో నీటి విడుదలను ప్రారంభించగా కోటగిరి, రుద్రూర్, వర్ని, బోధన్, చందూర్, మోస్రా, ఎడపల్లి మండలాల్లోని రైతులు ముందుగానే వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం మొదటి ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు వరినాట్లు వేస్తుండడడంతో ప్రధాన కాలువ ద్వారా 2005 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆయకట్టు కింద ఉన్న తొమ్మిదెకరాల్లో వరి నాట్లు వేశాను. ఆరేండ్లుగా యాసంగి, వానకాలం సీజన్లలో రెండు పంటలను పూర్తిస్థాయిలో సాగు చేస్తున్న. నీటి ఇబ్బందులు లేకుండా సాగు చేస్తుండడం సంతోషంగా ఉన్నది. ఎక్కువ సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తుండడంతో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతున్నది.
ఆయకట్టు కింద నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగు పనుల్లో బిజీగా ఉ న్నాం. నాకు ఐదెకరాల భూమి ఉండగా రెండు పంటలను సాగు చేస్తున్న. కానీ మొదటి ఆయకట్టు కింద ఉన్న భూముల్లో కాస్త అలస్యంగా సాగు చేయడం అలవాటైంది. అయినప్పటికీ పంటలు గట్టెక్కేంత వరకు నీటికి అందిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సంతోషంగా ఉన్నాం.