సిటీబ్యూరో: సీఆర్ఎంపీ పథకం అమలు ప్రక్రియ బల్దియాకు కత్తిమీద సాములా మారింది. సొంత నిధులను సమకూర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించిన నేపథ్యంలో రుణాల సేకరణ అనివార్యమైంది. అప్పుల కుప్పగా మారిన జీహెచ్ఎంసీ ఖజానాలో రుణాల సేకరణ సైతం కష్ట సాధ్యమేనన్న చర్చ అధికారుల్లో మొదలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీని కీలకమైన ప్రాజెక్టులకు నిధుల విషయంలో సహకరించాల్సిన ప్రభుత్వం కేవలం ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సీఆర్ఎంపీ ఫేజ్ -2 కింద రూ. 3,145 కోట్ల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులతోనే సరిపెట్టడం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
మొత్తం 1045.01 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్వహణకు రూపొందించిన ఈ పథకానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై అధికారుల్లో తర్జనభర్జన పడుతున్నారు. రహదారుల అభివృద్ధిని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. సీఆర్ఎంపీ రెండో దశ గతంలో మొదటి దశలో సంప్రదాయ పద్ధతిలో చేపట్టిన 744.22 కిలోమీటర్లలో పొడవైన బీటీ , సీసీ రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ కోసం అత్యధికంగా రూ. 2,230 కోట్లు అవసరమని అంచనా వేశారు. కొత్త సీసీ రహదారుల్లో భాగంగా మొదటి దశలో కవర్ కాని ప్రాంతాల్లో అదనంగా 64.49 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రహదారుల నిర్మాణానికి రూ. 208 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎఫ్డీఆర్ సాంకేతికతతో బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించారు.