హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్నది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 3 నుంచి 4 నెలల్లో దీనిని పూర్తిచేయాలని ఈసీఐ భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (సీఈవో) ఈసీఐ నుంచి అధికారిక సర్క్యులర్ అందింది. ఓటర్ల జాబితాను వంద శాతం దోషరహితంగా మార్చడమే లక్ష్యంగా సర్ కసరత్తు సాగుతున్నట్టు ఈసీఐ తెలిపింది.
సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా.. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో) నేరుగా ఓటర్ల ఇండ్లకు వెళ్తారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినవారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారు. 18 ఏండ్లు నిండిన యువతకు కొత్తగా ఓటుహకు కల్పిస్తారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి ప్రతి ఓటరు ఫొటో, చిరునామాను సరిచూస్తారు. ఈ భారీ కసరత్తు కోసం అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఈసీఐ ఆదేశించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ కోసం శిక్షణ, బీఎల్వోల నియామకం, క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను తక్షణమే పూర్తిచేయాలని సర్క్యులర్‌లో పేర్కొన్నది.
22 రాష్ట్రాల్లో మూడో దశ..
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరుగనున్నది. గత కొన్నేండ్లుగా ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చేర్పులు జరుగాల్సి ఉన్నదని, ముఖ్యంగా పట్టణీకరణ, వలసల కారణంగా జాబితాలో తప్పులు దొర్లాయని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే బీహార్ వంటి రాష్ట్రాల్లో మొదటి దశ పూర్తి కాగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో రెండో దశ కొనసాగుతున్నది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేది మూడో దశ కిందకు వస్తుంది. ఓటర్ల జాబితాపై గతంలో రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో ఈసారి సాంకేతికతతోపాటు క్షేత్రస్థాయి తనిఖీలకు ఈసీ పెద్దపీట వేస్తున్నది. ఓటుహకు సురక్షితంగా ఉండాలన్నా, కొత్త ఓటు నమోదు చేసుకోవాలన్నా అధికారులకు సరైన వివరాలు అందజేయాలని సూచిస్తున్నారు.
53% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
రాష్ట్రంలో రెండు నెలల క్రితమే సర్ ముందస్తు ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల ధ్రువీకరణలో భాగంగా ఇప్పటివరకు 53% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల గణన, మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,985 మంది బీఎల్వోలు రంగంలోకి దిగారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో తహసీల్దార్ స్థాయి అధికారులు (అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధ్రువీకరించేందుకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల రికార్డులు, రంగా ప్రోజెనీ మ్యాపింగ్ (వంశవృక్ష నిర్ధారణ) ద్వారా ఓటర్లను ధ్రువీకరిస్తున్నారు. ఓటర్ల జాబితాలో నకిలీలను తొలగించేందుకు 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.