హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల్లోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఔటర్ రింగు రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, వేరేచోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.