న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు శుక్రవారం కొనసాగాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం సీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు అషుతోష్ రాంకా, సౌరవ్ దాస్లతో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు సాగిన చర్చల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు అని సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ఇందులో కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని సీజేపీ అధికార ప్రతినిధి అషుతోష్ రాంకా వెల్లడించారు. ధర్మేంద్ర రాజీనామాకు శనివారం మధ్యాహ్నం దాకా కేంద్రం సమయం కోరిందని.. ఆయనను తొలగిస్తారని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. నేడు మరోసారి నడ్డా, జితేంద్ర సింగ్తో తాము సమావేశం అవుతామని రాంకా చెప్పారు. కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడుతూ సీజేపీ మూడు డిమాండ్లతో పాటు విద్యా సంస్కరణల కోసం ఐదు కీలక సూచనలు చేసిందని తెలిపారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం సానుకూలంగా చర్చిస్తుందన్నారు.
రాజీనామా కుదరదు : కేంద్రం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతుండగా.. ప్రభుత్వ వర్గాల నుంచి ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రాజీనామా చేయడం చాలా సులభమైన పని, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. అందుకే కేంద్ర ప్రభుత్వం రాజీనామాలకు బదులుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు చేపడుతోంది. ఇప్పటికే నీట్ లీకేజీ నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఆమోదించదగ్గ డిమాండ్ కాదని మొదటిసారి భేటీలోనే కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.