flydubai flight : దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానంలో అనూహ్య ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విమాన ఘటన ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ డా హమద్ అల్ షంసి ఆదేశించారు.
దీనిపై యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. విమాన ఘటనపై దర్యాప్తు చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై తీవ్రవాద కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామన్నారు. ఈ విమానం యూఏఈలోనే రిజిష్టర్ అయిందని, తమ దేశ జెండా కలిగి ఉందని తెలిపింది. ఈ విమానంలో జరిగిన ఘటనలు తమ దేశ చట్టాలకు చెందుతాయని, ఈ నేర ఘటనల్ని తాము విచారిస్తామని వివరించింది. తమ దేశం బయట ఘటన జరిగినప్పటికీ తమ విచారణ పరిధిలోకి వస్తుందని యూఏఈ తెలిపింది.
అసలు ఈ అంశంలో ఏం జరిగింది.. దీని వెనుక అసలు ఉద్దేశాలు ఏంటి.. ఏయే వ్యక్తులు ఉన్నారు వంటి అన్ని అంశాల్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ ఘటనకు అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలియరాలేదు. బుధవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) బయల్దేరిన విమానంలో కో పైలట్, పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఒమన్‌కు చెందిన కో పైలట్ విమానాన్ని కూల్చేందుకు యత్నించగా.. ఇండియన్ పైలెట్ స్మిత్ అడ్డుకున్నాడు. దీంతో విమానంలోని 180 మంది సురక్షితంగా బయటపడ్డారు.