మోపాల్ (ఖలీల్‌వాడి), నవంబర్ 3 : దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. మోపాల్ ఎస్సై యాదిగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రతి సంవత్సరం మాదిరిగా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని దర్గా వద్దకు ప్రత్యేక ప్రార్థనల కోసం ఆదివారం వచ్చారు.
ఇందులో వారి దగ్గరి బంధువులైన సయ్యద్ యాకుబ్ (32), సయ్యద్ వాసిక్ (34) ఇద్దరూ కలిసి సరదాగా స్థానిక పెద్ద చెరువు వద్దకు వెళ్లి, స్నానం కోసం అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడం, ఈతరాకపోవడంతో ఇద్దరూ నీట మునిగారు. గమనించిన స్థానికులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వచ్చి గాలించగా.. సయ్యద్ యాకుబ్ మృతదేహం లభ్యమైంది.
అనంతరం రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా సయ్యద్ వాసిక్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ వాసిక్ కరాచీ బేకరీలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా.. యాకుబ్ ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.