అసెంబ్లీ ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. క్యాడర్ చేజారుతుండడంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. అంతర్గత లుకలుకలతో సతమతమవుతున్నది. అభ్యర్థుల ఖరారులోనూ తడబడుతున్న ఆ పార్టీ.. కేవలం ఐదు చోట్లనే అభ్యర్థులను ప్రకటించి, మిగతా నాలుగింటిని పెండింగ్‌లో పెట్టింది. టికెట్ ఖరారు చేసిన స్థానాలతో పాటు మిగతా చోట్లా అసమ్మతి రాగాలు ఊపందుకుంటున్నాయి. కాంగ్రెస్ తీరు నచ్చని పార్టీ సీనియర్లు గులాబీ గూటికి చేరుతున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఇబ్బందులు పడుతున్నది. పూర్తిస్థాయిలో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగకముందే చేతులు ఎత్తేసే దుస్థితి హస్తం పార్టీకి ఎదురవుతున్నది. సగానికి ఎక్కువ నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులే లేకపోవడంతో పోలింగ్ తేదీకి నెల రోజుల ముందు కూడా చర్చోపచర్చల పేరుతో సాగదీస్తున్నారు. ఎవరైనా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి జంపింగ్ జపాంగ్‌లు వస్తే వారికే పెద్దపీట వేసి, అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టే దుస్థితికి కాంగ్రెస్ దిగజారడంతో ప్రజల్లో ఒకరకమైన చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో పీసీసీ ముఖ్య నాయకులంతా ఆగమాగం అవుతున్నారు. మొన్నటివరకు తాడోపేడో అంటూ తొడలు కొట్టిన వారికే కనీసం మొదటి, రెండో దఫా జాబితాలో చోటు దక్కకపోవడంతో నవ్వులపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. నేనెటూ పారిపోనంటూ షబ్బీర్‌అలీ ప్రకటనలు ఇచ్చినప్పటికీ.. ఏఐసీసీ వెలువరించిన రెండో జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో కాంగ్రెస్ పార్టీ పోటీకి ముందే చేతులెత్తేసిన పరిస్థితి నెలకొన్నది. పోలింగ్ తేదీకి సరిగ్గా నెల రోజులే ఉన్నప్పటికీ.. ఇంతవరకు అభ్యర్థుల వేటలోనే హస్తం పార్టీ మునిగి తేలుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలకుగాను ఇప్పటివరకు కేవలం 5 నియోజకవర్గాలకే అభ్యర్థులను ఖరారు చేశారు. కామారెడ్డి నుంచి పోటీకి సై అంటూ సవాల్ విసిరిన పీసీసీ ముఖ్యనాయకుడు షబ్బీర్‌అలీ పేరును కనీసం రెండో జాబితాలోనూ చేర్చకపోవడంతో హస్తం శ్రేణులు గందరగోళంలో పడ్డారు. కేసీఆర్ రాకతో షబ్బీర్‌కు భయం పట్టుకున్నదని, పోటీ చేసేందుకు భయపడుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఈ వ్యాఖ్యలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన క్షణాల్లోనే ఈ చేరిక జరగడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గతంలో ఉపఎన్నికల్లో విజయం సాధించిన జనార్దన్ గౌడ్‌ను పార్టీలోకి గులాబీ పార్టీ సాదరంగా ఆహ్వానించింది. ఇప్పటికే గులాబీ పార్టీలో మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు సైతం కొనసాగుతున్నారు. వీరంతా కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గెలుపు కోసం కృషి చేయబోతున్నారు.
హస్తం పార్టీలో అసెంబ్లీ సీట్లను పొందాలని భావించి, చివరకు నిరాశే ఎదురైన వ్యక్తులంతా తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2018, 2023 ఎన్నికల్లో వరుసగా చివరిదాకా పోటీలో నిలబడేందుకు తలబడిన వ్యక్తి.. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు పనిచేసే వారిని గుర్తించేవారు కరువయ్యారన్న బాధలో సదరు నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తున్నది. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలిసింది. నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ పార్టీ తీరు నవ్వులపాలవుతున్నది. మాజీ ఎమ్మెల్సీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కన్నేసిన ఈ స్థానంలో డాక్టర్ భూపతిరెడ్డికి ఏఐసీసీ సీటు ఖరారు చేయడంతో మిగిలిన వారంతా రగిలిపోతున్నట్లుగా సమాచారం. ఒక మాజీ ఎమ్మెల్సీ గతంలో టీడీపీలో పనిచేశారు. స్వరాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగు కావడంతో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అసెంబ్లీ సీటుపై కన్నేశారు.
ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. వీలైతే మరో పార్టీ జెండాను పట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌గా పనిచేసి, నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయాలని భావించిన మరో నాయకుడు సైతం తీవ్ర నిరాశలో మునిగినట్లు సమాచారం. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో మొన్నటివరకు బీజేపీ జెండా మోసిన వ్యక్తికి ఆకస్మాత్తుగా హస్తం పార్టీ టికెట్ రావడంపైనా పార్టీలో సీనియర్ లీడర్లు తీవ్రంగా అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా కలహాల కుంపటితో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రోడ్డెక్కి, నిరసనల వరకు చేరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.