నిజామాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటికి బురద రాజకీయంతో పాలన నడుస్తున్నది. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఇప్పుడేకంగా కాంగ్రె స్ పాలనలోనే ఆదరణకు నోచుకోవడం లే దు. ఎవరు ఎటు పోతే మాకేంటి అన్నట్లుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వ్యవహరిస్తుండటం హాస్యాస్పదంగా మారింది.
మంత్రి పదవి ఆశించి తీవ్రంగా భంగపాటుకు గురైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు ప్రభుత్వ సలహాదారు హోదాలో తొలిసారి నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి సొంత గడ్డకు వస్తున్న సీనియర్ ఎమ్మెల్యేకు అధికార పార్టీ నేతలతో పాటుగా ఉమ్మడి జిల్లా సమస్యలు సైతం తోరణంగా మారబోతున్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీ అంశం పట్టి పీడిస్తున్నది. హైకోర్టు తీర్పును అమ లు చేయకుండా రెండు వారాలుగా టీయూ పాలకులు చేష్టాలుడిగి చూస్తు న్న టీయూ వ్యవహారాలను చక్కబెట్టడం పి.సుదర్శన్‌రెడ్డికి ప్రధాన సవాల్‌గా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీలో పలు ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. నాడు మంత్రిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి వ్యవహారాలను చక్కబెట్టిన కాలంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. టీయూకు వీసీగా అక్బర్ అలీఖాన్ ఉన్నప్పుడు 91 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రకటన జారీ అయ్యింది. ఇందులో తెలివిగా రోస్టర్ విధానాన్ని తుంగలో తొక్కారు. రిజర్వేషన్లను ఇష్టమొచ్చినట్లుగా అమలు చేశారు. తద్వార అర్హులైన వారికి కాకుండా తాము అనుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పలు విచారణలు జరిగాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ సైతం చొరవ తీసుకుని ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. తప్పులు జరిగాయని తేటతెల్లమైనప్పటికీ వీసీ అక్బర్ అలీ ఖాన్ ఉద్దేశపూర్వకంగానే నియామక ఉత్తర్వులివ్వడంతో వివాదం అంటుకుంది. హైకోర్టు స్టేను ధిక్కరించి మరీ ప్రక్రియను పూర్తి చేయడంతో 13ఏళ్లుగా విచారణ జరిగి అక్టోబర్ 31న నోటిఫికేషన్లు రద్దు కాబడ్డాయి. ఈ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్న పి.సుదర్శన్ రెడ్డి తిరిగి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉమ్మడి జిల్లాకు పెద్దన్న పాత్రను పోషించబోతున్నాడు. వివాదం నడుస్తోన్న ఈ సమయంలోనే ప్రభుత్వ సలహాదారు హోదాలో టీయూకు కూత వేటు దూరం నుంచే రాబోతున్న సుదర్శన్ రెడ్డి ఈ దుస్థితిపై దృష్టి పెట్టేనా? అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
2006లో నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజీ పక్కనే పీజీ బిల్డింగ్‌లో తాత్కాలిక ఏర్పాట్లతో పురుడు పోసుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయం ఆది నుంచి పాలనాపరమైన ఇబ్బందులతో ఘోషిస్తూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో పునాది పడినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. టీయూలో అక్రమ నియామకాలకు నాటి నుంచే పెంచి పోషించడం వల్ల ఇప్పుడీ దుస్థితి ఏర్పడింది. అడుగడుగునా అవినీతి, అక్రమాలతో టీయూ నిండి పోయింది. 2012 నియామకాలపై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరగడం వల్ల రోస్టర్, రిజర్వేషన్ల అమలులో లోపాలు వెలుగు చూశాయి. ఇతర నియామకాలు, పీహెచ్డీ అడ్మిషన్లపై విచారణ చేయిస్తే మరిన్ని బాగోతాలు బట్టబయలయ్యే వీలు లేకపోలేదు.
నిత్యం రాజకీయ కదన రంగాన్ని తలపించేలా వర్గాలుగా విడిపోయి యూనివర్సిటీని నిత్య కొట్లాటలకు వేదికగా ఇక్కడ పని చేసే వారే మారుస్తున్నారు. ఇలాంటి చెడు వ్యవహారాలతో నాణ్యమైన విద్యా బోధన అన్నది ట్రాక్ తప్పిపోయింది. ఫలితంగా టీయూ ఆత్మ ఘోషిస్తోంది. సమస్యల్లో చిక్కిపోయి నీరసించి పోతోంది. వసతి గృహాల్లో యువతీ, యువకులకు పురుగుల అన్నం పెడుతున్న ఘటనలు గడిచిన 23 నెలల్లో నాలుగైదు సార్లు వెలుగు చూడగా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఇన్ఛార్జీ వీసీ కాలంలో, ఆ తర్వాత శాశ్వత వీసీ పాలనలోనూ టీయూకు పరిష్కారం దొరకకపోవడం విడ్డూరంగా మారింది. పని చేసే వారిలో నిబద్ధత, నిజాయతీ లేకపోవడమే వీటన్నింటికీ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మంత్రి కాని మంత్రిగా ప్రభుత్వ సలహాదారు పదవిని అధిరోహించిన పి.సుదర్శన్ రెడ్డి ఈ వ్యవహారాలను దారిలోకి తెస్తారా? లేదా? చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.