నిజామాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తరతరాలుగా అణిచివేతకు గురి వేయబడిన తెలంగాణకు విముక్తి ప్రసాదించిన పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. అలుపెరగని పోరాటాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు గులాబీ పార్టీ బాటలు వేసింది. ఎత్తిన జెండా దించకుండా… ప్రాణాలు తెగించి స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన మూడు అక్షరాల కేసీఆర్ సొంతం. సాధించిన స్వరాష్ర్టాన్ని నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌కు అనుగుణంగా బంగారు తెలంగాణగా కేసీఆర్ రూపాంతరం చెందించారు.
నాటి ఉద్యమ నేతగా, తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలుపెరగని సేవలు అందించారు. తెలంగాణ అంటే కేసీఆర్… కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా మార్చారు. తన శ్వాస, ఆశ అంతా తెలంగాణ రాష్ట్రమే. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సారథ్యంలో ఏర్పడిన పదేళ్ల ప్రభుత్వంలో అద్భుతమైన పనితీరు వెలుగు చూసింది. 2001లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఏప్రిల్ 27 నేటితో 25ఏళ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ద్విదశాబ్దిన్నర దాటిన ఉత్సాహంతో గులాబీ ఉత్సవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుగనున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గులాబీ జెండా ఆవిష్క రణలు జరుగ నున్నాయి. ఈ మేరకు పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తమ పరిధిలో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సంస్థాగతంగా గులాబీ పార్టీ గతం కంటే మిన్నగా పకడ్భందీగా బలోపేతమైంది. పార్టీయే సర్వస్వంగా పని చేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తోన్న గులాబీ శ్రేణులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన స్పందన లభించింది. ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ దక్కింది.
పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ పోరులో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు కైవసం చేసుకోగా పలు చోట్ల కీలకంగా నిలిచింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ, కామారెడ్డి మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్‌గా నిలిచి సత్తా చాటుకుంది. ఇదే ధోరణిలో సమీప భవిష్యత్తులోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులోనూ ప్రజల మద్ధతుతో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుటిల బుద్ధిని బద్ధలు కొట్టి పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించనుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ జనాల విశ్వాసాన్ని కోల్పోయింది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి వలసలు విపరీతంగా పెరుగుతుండటం ఇందుకు సంకేతంగా నిలుస్తోంది.
స్వల్ప ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితికి ఆదరణ అద్భుతంగా ఉంది. కేసీఆర్ మాట కోసం, ఆయన వేసే బాట కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జైత్రయాత్ర సభతో ప్రభంజనం సృష్టించగా జనాల స్పందన ఇందుకు అద్దం పడుతోంది. కేసీఆర్ సభను అడ్డగించేందుకు కుయుక్తులకు దిగిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చేదు అనుభవమే ఎదురైంది. ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కోసం లక్షలాది మంది జనాలంతా ఎదురు చూడటం అంటే మామూలు విషయం కాదు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గులాబీ పార్టీకి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినప్పటికీ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పరిపాలనను చూస్తోన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచేది గులాబీ జెండానే అని నిర్ణయించుకుంటున్నారు. ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే 2028లో మరోసారి ఏర్పాటు కావాలని అంతటా ఆశిస్తున్నారు. సీఎంగా మూడోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయాలని అభిలాషిస్తున్నారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం తిరిగి తలెత్తుకునే స్థాయికి ఎదగాలని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు.